జమ్ములో బీజేపీ నేత కాల్చివేత 

జమ్ముకశ్మీర్‌లో బీజేపీ నేతను తీవ్రవాదులు దారుణంగా హతమార్చారు. కుల్గాం జిల్లాలోని బ్రజ్లూ జాగీర్‌ ప్రాంతంలో బీజేపీ నాయకుడిని మంగళవారం సాయంత్రం తీవ్రవాదులు తుపాకీతో కాల్చి హతమార్చారు. మృతుడు జావీద్‌ అహ్మద్‌ దార్‌.. నియోజకవర్గ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలోకి బ్రజ్లూ జాగీర్‌ ప్రాంతంలోని దార్‌ ఇంట్లోకి నేరుగా వచ్చిన తీవ్రవాదులు ఒక్కసారిగా ఆయనపై తుపాకీ ఎక్కుపెట్టి పేల్చారు. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అనంతరం తీవ్రవాదులు అక్కడి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. 

తీవ్రంగా గాయపడిన దార్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటన అనంతరం భద్రతా దళాలు, పోలీసులు రంగంలోకి దిగి తీవ్రవాదులను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి.

ఈ ఘటనను దురదృష్టకరమైనది అని, ఇలా తుపాకులతో భయపెట్టాలని చూడటం తగదని బీజేపీ మీడియా సెల్‌ ఇంఛార్జీ మంజూర్‌ అహ్మద్‌ ఖండించారు. బీజేపీ నాయకుడిని హత్య చేయడాన్ని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఓమర్‌ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. 

‘కుల్గాంలో బీజేపీ నాయకుడుని తీవ్రవాదులు దారుణంగా హత్యగావించిన వార్త ఇప్పుడే అందింది. దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. జావీద్‌ అహ్మద్‌ దార్‌ కుటుంబానికి, ఆయన పార్టీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఓమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌లో రాశారు.