వివేకా హత్య కేసులో ఆయుధాల కోసం సోదాలు

వివేకా హత్య కేసులో ఆయుధాల కోసం సోదాలు
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి కీలక సాక్ష్యాధారాల సేకరణలో సిబిఐ ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. సంవత్సరం దాటినా అంతుబట్టని చిక్కుముడిని విప్పడం కోసం వేగంగా కదులుతున్నారు. హత్య సూత్రధారులను త్వరలో తేల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను దాచిపెట్టారనే పక్కా సమాచారంతో శనివారం పులివెందుల పట్టణానికి అర కిలోమీటరు దూరంలోని రోటరీపురం వాగులో పది మందికిపైగా సీబీఐ బృందం గాలింపు చేపట్టింది. వాగులో నీటిని మొదట ట్యాంకర్ల ద్వారా, ఆ తరువాత మోటర్ల ద్వారా తోడేస్తున్నారు. అవి దొరికితో పెద్ద ముందడుగు కాగలదని భావిస్తున్నారు. 
 
తప్పించుకొని తిరుగుతుండగా, గత వారమే గోవాలో అరెస్ట్ చేసిన సీబీఐ కస్టడీలో ఉన్న కీలక అనుమానితుడు యాదటి సునీల్‌ యాదవ్‌(26) ఇచ్చిన సమాచారం మేరకే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సీబీఐ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.
 
 మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి ఆదేశాలతో 20మంది మున్సిపల్‌ సిబ్బంది ట్యాంకర్లు, మోటర్ల ద్వారా నీటిని తోడుతున్నారు. ఉదయం 11.15 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తోడినా నీరు తగ్గకపోవడంతో వాగుకు గండి కొట్టినట్టు తెలిసింది.
 
వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శనివారం నలుగురిని విచారించారు. కడప కేంద్రకారాగారంలోని అతిథిగృహం కేంద్రంగా విచారణ సాగుతోంది. పులివెందులలో చెప్పుల షాపు నిర్వాహకుడు మున్నా, వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి, సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన ఉమాశంకర్‌రెడ్డి, కడప రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ మోహన్‌రెడ్డిని అధికారులు విచారించారు.