వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేట్

వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేట్

పులిచింతల ప్రాజెక్టులోని 16వ నంబరు గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో భారీఎత్తున నీరు వృథాగా పోతోంది. పులిచింతల ప్రాజెక్టులో మొత్తం 24 గేట్లు ఉన్నాయి. కొన్ని రోజులుగా నాగార్జునసాగర్‌ నుంచి వరద నీరు పులిచింతలకు చేరుతోంది. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయానికి ప్రాజెక్టులోని 13, 14 నంబరు గేట్ల ద్వారా నీరు విడుదలచేశారు. 

ఆ తర్వాత గంటకు 15, 16 గేట్లు నాలుగు అడుగులు పైకెత్తి నీటిని విడుదల చేస్తుండగానే ఈ ఘటన జరిగింది. వరద ఉధృతికి ఇనుపతాళ్లు, గడ్డర్లు తెగిపోవడంతో గేటు పూర్తిగా ఊడి నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టులో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. పెరిగిన ఉధృతితో అప్రమత్తమైన అధికారులు వచ్చి చూడగా, గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసింది. 

ఈ సమయంలో నాలుగు అడుగులమేర మాత్రమే గేట్లు ఎత్తినట్టు, ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ఇంజనీర్లు తెలిపారు. ఉదయం అక్కడకు చేరుకున్న జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌,  ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు. పులిచింతల ప్రాజెక్టులో 16వ గేటు స్థానంలో శుక్రవారం సాయంత్రానికి ఎమర్జెన్సీ గేటు అమర్చి నీరు దిగువకు వెళ్లకుండా అపుతామని మంత్రి తెలిపారు.

 ‘‘గేటు ఊడి పోవటానికి కారణం ఏమిటనే దానిపై విచారిస్తున్నాం. దీనిపై కమిటీ వేస్తాం. నిపుణులతో 16వ నంబరు గేటుతో పాటు అన్ని గేట్లను కూడా పరిశీలన చేయిస్తాం. గేటు గడ్డర్‌ బరువు 250 టన్నులు ఉంటుంది. అయినా సమస్య రావడంపై పరిశీలన జరుపుతున్నాం’’ అని చెప్పారు. 

అయితే, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉందని, పది టీఎంసీలు ఉంటేనే తాత్కాలిక గేటు అమర్చేందుకు అవకాశం ఉంటుందని  ఈఎన్‌సీ నారాయణరెడ్డి తెలిపారు. లోపం ఎక్కడ జరిగిందనేని రిటైర్డు ఇంజనీర్లతో కమిటీ వేస్తామని తెలిపారు. ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని మాత్రం చెప్పలేనని పేర్కొన్నారు.

తాత్కాలిక గేటు అమరిక పనులను ప్రాజెక్టు ఎస్‌ఈ రమేశ్‌ పర్యవేక్షిస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రాజెక్టును మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, పేర్ని నాని, కృష్ణా కలెక్టర్‌ జే నివాస్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు సందర్శించారు. పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు. ప్రస్తుతం ఇక్కడ 172.76 అడుగుల మేరకు నీరు ఉంది.

ఈ నీటిని 140 అడుగులకు తగ్గించి స్టాప్‌ లాక్‌ గేటును కొట్టుకుపోయిన గేటు స్థానంలో అమర్చుతున్నారు. ఈ మేరకు ప్రాజెక్టును ఖాళీ చేయడం కోసం ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. దీంతో బ్యారేజీకి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వరద తిరిగి ప్రమాదకరస్థాయిలో పెరిగిపోయింది.

గురువారం రాత్రి 7.30గంటలకు పులిచింతల వద్ద ఔట్‌ఫ్లో 5,02,216క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్‌ఫ్లో 1,33,939 క్యూసెక్కులు ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కే కన్నబాబు తెలిపారు. అధికారుల అంచనా ప్రకారం 6లక్షల క్యూసెక్కుల వరకు నీరు రానున్నదని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు.