కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఏపీ `దిశ’ బిల్లులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను పరిశీలిన అనంతరం తమ అభిప్రాయాలను జోడించి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు – క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరినట్లు ఆమె తెలిపారు. కాగా, మహిళల కోసం ఏపీలో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్మ్రితి ఇరానీ తెలిపారు.చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాల్లో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదని మంత్రి చెప్పారు. 
 
హింసకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు పోలీసు రక్షణ, వైద్య, న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ సేవలతోపాటు వారికి ఆశ్రయం కల్పించేందుకు దిశ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు మంత్రి వివరించారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ కేంద్రాల్లో రేయింబవళ్లు సేవలు అందుతున్నాయని చెప్పారు. 
 
మహిళల సాధికారతను సాధించేలా వారికి రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్ శక్తి కార్యక్రమం కింద ఆయా జిల్లాల్లో దిశ కేంద్రాల స్థాపన జరిగినట్లు మంత్రి పేర్కొన్నారు.  దిశ (క్రిమినల్‌ లా సవరణ) బిల్లుపై అభిప్రాయాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి 2020 జనవరి 21న తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి చెప్పారు.
ఈ బిల్లుపై తమ  మంత్రిత్వ శాఖతమ అభిప్రాయాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరినట్లు ఆమె వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరణలను జత చేస్తూ తిరిగి హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లును తమ మంత్రిత్వ శాఖకు పంపించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తమ  మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి గత జూన్‌ 15న ఈ బిల్లును హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆమె వెల్లడించారు.
మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచార నేరాలనుత్వరితగతిన విచారించేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఉద్దేశించిన మరో బిల్లు 2020 జనవరి 29న హోం మంత్రిత్వ శాఖ నుంచి తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి తెలిపారు.
దీనిపై కూడా తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించామని,  అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా బిల్లును ఈ ఏడాది జనవరి 11న హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపిందని పేర్కొన్నారు. దానిపై కూడా తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు తెలియచేశామని తెలిపారు.