వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కి సిబిఐ నోటీసు

వైసీపీ సోషల్ మీడియా విభాగంపై సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను దూషించిన కేసులో సీబీఐ వేగంపెంచింది. ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు సీబీఐ నోటీసులిచ్చింది. తాజాగా, విచారణకు రావాలని వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దేవేందర్‌రెడ్డిని సీబీఐ ఆదేశించింది.
హైకోర్టు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో కించపర్చే పోస్టులను హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐకి న్యాయస్థానం అప్పగించింది.  న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాలతో 16 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
విశాఖలో 12 మంది, ఇతర ప్రాంతాల్లో నలుగురిపై సీబీఐ కేసు పెట్టింది. సోషల్ మీడియాలో హైకోర్టుతో పాటు ఇతర న్యాయమూర్తులను కించపరిచే విధంగా పెట్టిన పోస్టులపై సీబీఐ నివేదికను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం పౌరులందరికీ భావప్రకటన స్వేచ్చ ఉంది. అయితే అభిప్రాయాలను వ్యక్తపరిచే విషయంలో కొన్ని పరిమితులు కూడా విధించారు.
భావ ప్రకటన పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. అలాగే ఎదుటి వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యానించకూడదు. అయితే కొందరు మాత్రం సోషల్ మీడియా వేదికగా రాజ్యాంగంలో కల్పించిన హద్దులు దాటి పోస్టులు పెడుతున్నారు. 
 
ఇతరుల ప్రాథమిక హక్కులను హరించే వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 67 ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.