ఏపీ ఆర్ధిక వ్యవహారాల అరాచకంకు కేంద్రం కట్టడి

అప్పుల కుప్పలుగా మారి, ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో క్రమశిక్షణను పాటించడం లేదని ఇప్పటికే పలు పర్యాయాలు చివాట్లు పెట్టిన కేంద్రం ఇక  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇష్టం వచ్చిన్నట్లు కేంద్ర నిధులను ఖర్చు చేయకుండా కట్టడి చేస్తున్నది.
 
కొత్తగా విడుదల చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం కేంద్ర నిధులను వేరే ఖాతాలకు, పిడి ఖాతాలకు మళ్లిస్తూ దుర్వినియోగం చేస్తున్న ఏపీ ప్రభుత్వ వ్యవహారాలను కట్టడి చేయడం ప్రారంభించింది. ఇక నుండి కేంద్రం ఏ పథకాలకు నిధులు ఇస్తే వాటికే ఖర్చుచేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇచ్చిన వాటా నిధులు ఖర్చుచేసి ఆ పథకంలో రాష్ట్ర వాటా తర్వాత చెల్లిస్తామన్నా అవకాశం ఉండదు. కేంద్రం నిధుల వినియోగానికి సంబంధించిన విధానాన్ని మార్చేసింది. కొత్త మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాక ఖరారు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాల వల్ల తమ పథకాల అమలు తీరు సరిగా లేదని కేంద్రం భావిస్తోంది. అందుకే కొత్త మార్గ దర్శకాల ప్రకారం కేంద్రం నుంచి వచ్చే నిధులను వేరే అవసరాలకు వినియోగించుకుని, ఆ తర్వాత ఏడాది ఖర్చు చేయడం ఇకపై కుదరదు. కొత్త విధానాల ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు చేసి తమకు తెలియజేయాలని కేంద్రం కోరింది. 
 
ముందు రాష్ట్రాలు తమ అవసరాలకు నిధులు వాడుకుని, తర్వాత కేంద్ర పథకాలపై దృష్టి సారిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో కేంద్రం పథకాల అమలుకు, పారదర్శకంగా నిధులు ఖర్చు చేయడానికి, లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చేసింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం జులై నుంచి అమలు ప్రారంభించింది. 
 
20 రాష్ట్రాలు ఈ నిర్ణయంపై సానుకూలత వ్యక్తం చేయగా, ఏపీ మాత్రమే ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విధానంతో ఆర్థిక నిర్వహణలో సమస్యలు వస్తాయని, రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటున్న కేంద్ర నిధులను ఇక ముందు అలా ఖర్చుచేసే పరిస్థితులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలుచేసేలా ఎనిమిది అంశాల్లో ఏర్పాట్లు చేసి తమకు తెలియజేయాలని కేంద్రం కోరింది.
పథకాలకు సంబంధించి కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తుంది. రిజర్వు బ్యాంకులోని రాష్ట్రాలకు సంబంధించి అకౌంట్లలో జమ చేస్తారు. ఆ నిధులు వచ్చిన 21 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలకు బదిలీ చేయాలి. 
 
కేంద్రం తన వాటా విడుదల చేసిన 40 రోజుల్లోగా రాష్ట్రం తన వాటాను ఆ అకౌంట్లకు పంపాలి. ప్రతి పథకానికి నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేసి, లబ్ధిదారుల అకౌంట్లను పబ్లిక్‌ ఫైనాన్స్ నిర్వహణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి. డబ్బులు పథకం కింద చెల్లింపులు చేయాల్సిన ఖాతాలకు తప్ప ఎక్కడికీ బదిలీలు ఉండడానికి వీల్లేదు. 
 
పబ్లిక్‌ ఫైనాన్సు మేనేజ్‌మెంట్ వ్యవస్థలో చివరి లబ్ధిదారుడి వరకు ఉన్న అన్ని ఖాతాలు మ్యాపింగ్‌ చేయాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్రం 25 శాతం లోపు నిధులే ఇస్తుంది.. రాష్ట్రం తన వాటా నిధులను కూడా జతచేసి అందులో 5 శాతం ఖర్చు చేసిందని ధ్రువీకరించుకున్నాకే మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది.
 
 ఖర్చు చేయని నిధులను అమలుచేసే ఏజెన్సీలు నోడల్‌ ఏజెన్సీ ఖాతాలకు తిరిగి జమ చేయాలి.. దీనికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత.
ఇలా ఉండగా, అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారిందిని పేర్కొంటూ ఏపీ ఆర్ధిక వ్యవహారాల తీరుపై పార్లమెంట్ వేదికగా కేంద్రం తన అసంతృప్తిని బహిరంగ పరచింది. ఆదాయానికి మించి అప్పులు చేయడంలో ఏపీ అగ్రభాగాన ఉందని కేంద్రం పేర్కొంది.
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పార్లమెంటు సాక్షిగా ఏపీకి కేంద్ర ఆర్థికశాఖ అక్షింతలు వేసింది.  2020-21 సంవత్సరానికి రు.54,369.18 కోట్ల ఆర్థిక లోటు ఉందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని కేంద్రం తెలియజేసింది. 15వ ఆర్ధిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ. 30,305 కోట్ల అప్పునకు అనుమతి కోరిందని కేంద్రం పేర్కొంది.

కొవిడ్‌ కారణంగా మరో రూ.19,192 కోట్ల అప్పునకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 49,497 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చామని పేర్కొంది. పరిమితికి మించి ఏపీ రూ.4,872 కోట్ల అప్పు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.