ఈటెలకు మంత్రివర్గం నుండి ఉద్వాసన తప్పదా!

కరోనా కట్టడిలో నేరమయ నిర్లక్ష్యం ప్రదర్శించడంతో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన్నట్లు అన్ని వైపులా నుండి విమర్శలు చెలరేగుతూ ఉండడంతో అందుకు బాధ్యునిగా చేస్తూ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ను మంత్రి వర్గం నుండి తొలగించమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వత్తిడులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. 

కరోనా ప్రమాదం ఎదురైన తొలి రోజులలో ఒక వంక ముఖ్యమంత్రి, మరో వంక రాజేందర్ కలసి మొత్తం దేశంలో అందరూ ప్రశంసించే విధంగా కృషి చేశారు. కరోనా కట్టడికి కఠినమైన ఆంక్షలు అమలు జరిపారు. 

ముఖ్యంగా రాజేందర్ ఈ పోరాటంలో ముందుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించారు. సొంత పార్టీ నుండే కాకుండా ప్రతిపక్షాల ప్రశంసలు కూడా పొందారు. ఎవ్వరు ఏ సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చినా వెంటనే స్పందిస్తారని నానుడి ఉంది. 

అప్పట్లో ఎక్కడా కనిపించని కేసీఆర్ కుమారుడు, ఐటి మంత్రి కేటీఆర్ ఆ తర్వాత రంగప్రవేశం చేసి, ఒవైసి సోదరులతో మంతనాలు జరిపిన తర్వాత ప్రభుత్వం కరోనా విషయంలో వెనుకడుగు వేయడం ప్రారంభించింది. కరోనా టెస్ట్ లను దారుణంగా తగ్గించారు. 

లాక్ డౌన్ అమలును పూర్తిగా సడలించారు. మద్యం షాపులు తెరవడంతో రోడ్లపై జనాన్ని నియంత్రించే వారు లేకపోయారు. దానితో కరోనా విస్తృతంగా వ్యాపించింది. నేడు తిరిగి మరో పక్షం రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని స్వయంగా కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. 

చివరకు రాజేందర్ మాటలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కూడా లెక్కచేయని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో కరోనా గురించి వెలిసిన ప్రభుత్వ హోర్డింగ్ లలో ఒక వంక కేసీఆర్, మరో వంక కేటీఆర్ ఫోటోలు దర్శన మిస్తున్నాయి. కానీ వాటిల్లో ఎక్కడా ఆరోగ్య మంత్రి రాజేందర్ ఫోటో లేనే లేదు.

అంటే పాలనా యంత్రాంగంలో ఆయన ఉనికి ప్రశ్నార్ధకరంగా మారినట్లు స్పష్టం అవుతున్నది. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంకు రాజేందర్ ను `బలి పశువు’ చేస్తూ రాజేందర్ ను త్వరలో మంత్రివర్గం నుండి తొలగింపనున్నారని అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కోసం ప్రకటిస్తే అధికార పక్ష నేతలు ఎవ్వరు స్పందించక పోవడం గమనార్హం.

ఆర్ధిక మంత్రి టి హరీష్ రావుకు సన్నిహితుడైన రాజేందర్ ఉనికి పట్ల కేటీఆర్ తొలి నుండి అసహనంగా ఉంటూ వస్తున్నారు. పైగా పార్టీ ప్రారంభం నుండి కేసీఆర్ వెంట ఉంటూ ఉండడంతో ఆయనకు పార్టీలో, ప్రజలలో కొంత పలుకుబడి ఉండే. ఇదే కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారింది. 

రెండో సారి ముఖ్యమంత్రి చేపట్టిన తొలి మంత్రి వర్గంలో కేసీఆర్ హరీష్ రావుతో పాటు రాజేందర్ ను కూడా పక్కన పెట్టడం తెలిసిందే. అయితే ప్రభుత్వ పనితీరు పలచబడి పోతున్నదని గ్రహించి తప్పని పరిస్థితులలో తిరిగి మంత్రివర్గ్మలోకి తీసుకున్నారు. 

ఈ పరిస్థితుల పట్ల తన అసహనాన్ని రాజేందర్ గత నెల బహిరంగంగానే వ్యక్తం చేసారు. గులాబీ జెండాకు ఆశాలమైన యజమానులం తామే అంటూ సంచలన వాఖ్యలు చేశారు. అయితే వెంటనే కార్యకర్తలే పార్టీ జెండాకు అసలైన యజమానులని అంటూ కేటీఆర్ వెంటనే కౌంటర్ ఇచ్చారు.