గోదావరి ఉగ్రరూపం .. ఉధృతంగా కృష్ణా … వరదల జోరు 

ఎగువ రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలోని పోలవరం నిర్వాసిత గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వరద అంతకంతకూ పెరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 

తెలంగాణలోని భద్రాచలంలో రెండు ప్రమాదం హెచ్చరిక ఎగుర వేశారు. మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ప్రాణహిత, శబరి నదుల నుంచి వస్తోన్న నీటి ప్రవాహానికి భద్రాచలం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 20 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారం సాయంత్రానికి 48.10 అడుగులకు చేరిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటకు అడుగు చొప్పున నీటిమట్టం పెరిగింది.

గోదావరి ఉధృతికి పర్ణశాల సీతమ్మ విగ్రహం నీట మునిగింది. భద్రాచలం దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. భద్రాచలం ఎగువన ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు గోదావరిలోకి వదులుతున్నారు. శనివారం రాత్రి సమయానికి భద్రాచలం వద్ద 12 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. 

వరద ప్రవాహం ఇదేవిధంగా కొనసాగితే ఆదివారం మధ్యాహ్నానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కాటన్‌ బ్యారేజీ నుంచి 4.61 లక్షల మిగులు జలాలను సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. గోదావరి ఉధృతితో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని 30 గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది.

ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగింది. జూరాల నుంచి 3,53,476 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి అనంతరం 17,341 క్యూసెక్కులు కలిసి మొత్తం 3,70,817 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఈ జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 855.60 అడుగుల నీటిమట్టం ఉంది. తెలంగాణ విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం 25,427 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. శనివారం సాయంత్రం 97,251 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 93,150 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో, ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న గ్రామలకు వరద ముప్పు ఏర్పడింది. పులిచింతల జలాశయంలో పూర్తి స్థాయి సామర్థ్యం 45.77 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 43.60 టిఎంసిల నీరు నిల్వ ఉంది. వరద నీరు చేరుతుండడంతో 13,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.