ఉయ్ఘర్‌ ముస్లింలపై హింసకు చైనా నిర్బంధ కేంద్రాలు

ఉయ్ఘర్ ముస్లింలతోపాటు ఇతర మైనారిటీలను హింసించడానికి చైనా ప్రభుత్వం జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో 240 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నప్పటికీ, నిర్బంధ కేంద్రాల సంఖ్యను తగ్గించడం లేదు. కొన్ని నిర్బంధ కేంద్రాల్లో కొత్త భవనాలు సైతం నిర్మిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

దబాంగ్‌చెంగ్‌లోని నిర్బంధ కేంద్రం దాదాపు 220 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఉయ్ఘర్ ముస్లింలను ఈ కేంద్రంలో ఉంచారు. వీరికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర గురించి తెలియజేస్తున్నారు. ఇటువంటి ఎన్ని నిర్బంధ కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించేందుకు చైనా అధికారులు నిరాకరిస్తున్నారు. అయితే, ఇలాంటి 240 కేంద్రాలు పనిచేస్తున్నట్లు జర్నలిస్టుల పరిశీలనలో తేలింది.

ఈ నిర్బంధ కేంద్రంలో దాదాపు 10 వేల మందికిపైగా ఉయ్ఘర్ ముస్లింలు ఉన్నట్లు జర్నలిస్టులు గుర్తించారు. ఈ స్థలాన్ని పరిశీలిస్తే ఇటువంటి నిర్బంధ కేంద్రాలను మూసివేయాలని చైనా భావించడం లేదని తెలుస్తున్నదని ఉయ్ఘర్‌ ముస్లింలపై కథనం కోసం వచ్చిన ఒక జర్నలిస్టు చెప్పారు. ఇక్కడ పలు కొత్త భవనాలు కూడా నిర్మిస్తున్నారని, ఉగ్రవాదంపై పోరాడటానికి ఈ నిర్బంధ కేంద్రాలు నిర్మించినట్లు చైనా వాదిస్తున్నదని తెలిపారు. 

ఈ కేంద్రాలను వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అని పిలుస్తుండటం విశేషం. జిన్జియాంగ్‌లోని ఈ నిర్బంధ కేంద్రాల గురించి అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. విదేశాలకు వెళ్లిన తర్వాత లేదా మతపరమైన వేడుకల్లో పాల్గొన్న తర్వాత వారిని శిక్షించి ఇక్కడ బంధిస్తారని పరిశోధకులు భావిస్తున్నారు.

ఎలాంటి నేరం లేకుండానే ఈ నిర్బంధ కేంద్రాల్లో బంధించి హింసించబడుతున్న వందలాది మంది ఉయ్ఘర్లు ఉన్నారని ఉయ్ఘర్లపై అధ్యయనం చేస్తున్న కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన మానవ శాస్త్రవేత్త డారెన్ బేలర్ పేర్కొంటున్నారు.