వైరస్ లీక్ పై దర్యాప్తుకు మరోసారి చైనా వ్యతిరేకత

క‌రోనా వైర‌స్ చైనాలోని వుహాన్ వైరాల‌జీ ల్యాబ్ నుంచి లీకైన‌ట్లు చెలరేగిన ఆరోపణలపై ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఓసారి ద‌ర్యాప్తు చేప‌ట్టింది. కానీ ఆ ల్యాబ్ లీక్ థియ‌రీని ఆ బృందం స‌మ‌ర్థించ‌లేదు. అయితే మ‌రోసారి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌  చైనాలో వైర‌స్ లీక్ అంశాన్ని ద‌ర్యాప్తు చేయాల‌ని భావిస్తున్న‌ది. 
అయితే,  వైర‌స్ మూలాల కోసం రెండ‌వ సారి చేప‌ట్టే ద‌ర్యాప్తును అడ్డుకుంటున్న‌ట్లు చైనా వెల్ల‌డించింది. మ‌రోసారి విచార‌ణ చేప‌ట్టే ప్ర‌ణాళిక‌ను చైనా తోసిపుచ్చింది. వాస్తవానికి ఈ నెల‌లో ఆ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తిపాదించింది. చైనాలో ఉన్న వైరాల‌జీ ల్యాబ్‌ల‌ను ఆడిట్ చేయ‌డంతో పాటు వుహాన్‌లో ఉన్న జంతు మార్కెట్ల‌ను ప‌రిశీలించాల‌నుకున్న‌ది. పార‌ద‌ర్శ‌కమైన విచార‌ణ నిర్వ‌హించాల‌నుకున్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థకు చైనా నుంచి ధిక్క‌ర‌ణ ఎదురైంది.
వైర‌స్ పుట్టుక‌, ఆన‌వాళ్ల‌ను ప‌సిక‌ట్టే ద‌ర్యాప్తును తాము అంగీక‌రించ‌డం లేద‌ని చైనా నేష‌న‌ల్ హెల్త్ క‌మిష‌న్ మంత్రి జెంగ్ యిక్సిన్ తెలిపారు. కొన్ని అంశాల్లో దీన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. సామాజిక స్పృహ‌కు విరుద్ధ‌మ‌ని, ఇది సైన్సును ధిక్క‌రిస్తున్న‌ట్లుగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.
చైనా ల్యాబ్‌ల్లో ఉన్న ప్రోటోకాల్స్‌లో ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని చెప్పారు. చైనా నిపుణులు చేసిన ప్ర‌తిపాద‌న‌లు, సూచ‌న‌ల‌ను ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ స‌మీక్షిస్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని, వైర‌స్ పుట్టుక‌ను శాస్త్రీయ అంశంగా ప‌రిగ‌ణించాల‌ని జెంగ్ తెలిపారు.
దీంతో రాజ‌కీయ జోక్యాన్ని దూరం పెట్టాల‌ని పేర్కొంటూ వైర‌స్ పుట్టుకపై అధ్య‌యాన్ని రాజ‌కీయం చేయ‌డాన్ని చైనా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు జెంగ్ చెప్పారు. వైర‌స్ ఆన‌వాళ్ల కోసం కేవ‌లం చైనాలో కాకుండా.. ఇత‌ర దేశాల్లో ప‌రిశోధ‌న‌లు చేయాల‌ని జెంగ్ డ‌బ్ల్యూహెచ్‌వోకు సూచించారు.