ఒలింపిక్స్‌ నిర్వహణకై టోక్యోలో అత్యవసర పరిస్థితి

ఒలింపిక్స్‌ నిర్వహిస్తున్న టోక్యో నగరంలో జపాన్‌ ప్రధాని యోషిహిదే సుగా కరోనా వైరస్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఒలింపిక్స్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన విడుదల చేశారు. 
 
సోమవారం నుండి అత్యవసర పరిస్థితి సోమవారం నుండి అమల్లోకి వస్తుందని, ఆగస్ట్‌ 22 వరకు ఉంటుందని సుగా చెప్పారు. ఒలింపిక్స్‌ జులై 23న ప్రారంభమై ఆగస్ట్‌ 8న ముగుస్తాయని, అంటే ఒలింపిక్‌ క్రీడలు ముగిసేంతవరకు అత్యవసర పరిస్థితి నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 
 
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భవిష్యత్తులో కూడా వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు అత్యవసర పరిస్థితి అవసరమని ప్రధాని వివరించారు. చివరిగా మే మధ్యలో నమోదైన గరిష్ట స్థాయి కేసులకు దగ్గరగా.. గురువారం తాజాగా 896 కేసులు నమోదవడంతో.. ఈ అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
 
కాగా, జపాన్‌లో ఎనిమిది లక్షల పదివేల కరోనా కేసులు నమోదుకాగా, 14,900 మంది మరణించారు. వేలాది మంది అథ్లెట్లు, నిర్వాహకులు, అధికారులు ఒక్క చోట చేరడంతో వైరస్‌ వ్యాప్తికి ఆజ్యంపోస్తుందని ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులను నిలిపివేయడంతో వైరస్‌ వ్యాప్తి తగ్గవచ్చంటూ నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇప్పటికే విదేశీ ప్రేక్షకులను నిషేధించినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశీయంగా 50 శాతం సామర్థ్యంతో గరిష్టంగా 10 వేల మందికి పరిమితి విధించారు. ప్రేక్షకుల అనుమతిపై రెండురోజుల్లో చర్చలు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాక్సిన్‌ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో .. ఆదేశ జనాభాలో నాలుగింట ఒకవంతు మాత్రమే వ్యాక్సిన్‌ డోసులు తీసుకున్నారు.