కొవిషీల్డ్ కు 7 ఈయూ దేశాల గ్రీన్‌సిగ్న‌ల్‌

కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ల ప్ర‌యాణాల విష‌యంలో నెల‌కొన్న వివాదానికి తెర‌దించే ప్ర‌య‌త్నం చేశాయి ఏడు ఐరోపా యూనియ‌న్ దేశాలు. ఆస్ట్రియా, జ‌ర్మ‌నీ, స్లొవేనియా, గ్రీస్‌, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్‌, స్పెయిన్ దేశాలు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేసిన కొవిషీల్డ్‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాయి. 

అటు స్విట్జ‌ర్లాండ్ కూడా కొవిషీల్డ్ వేసుకున్న ప్ర‌యాణికుల‌ను అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించింది. యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఫైజ‌ర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్స్‌జెర్‌వ్రియా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు చెందిన జాన్సెన్ వ్యాక్సిన్‌ల‌కు మాత్రమే అనుమ‌తి ఇచ్చింది. 

అంటే ఈ నాలుగు ర‌కాల వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ల‌కు మాత్ర‌మే ఈయూలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఈ జాబితాలో కొవిషీల్డ్ లేక‌పోవ‌డంతో చాలా మంది ప్ర‌యాణికుల‌ను ఈయూ దేశాలు అనుమ‌తించ‌లేదు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వేసుకున్న వాళ్లు ఈ దేశాల‌కు వ‌స్తే క్వారంటైన్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

దీనికి కౌంట‌ర్‌గా బుధ‌వారం భార‌త విదేశాంగ కూడా అదే నిర్ణ‌యం తీసుకుంది. ఈయూ దేశాలు త‌మ వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ల‌ను అనుమ‌తించే వ‌ర‌కూ అక్క‌డి నుంచి ఇండియా వ‌చ్చిన వాళ్లూ క్వారంటైన్‌లో ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో యురోపియ‌న్ యూనియ‌న్‌లో ప్ర‌స్తుతానికి ఈ ఏడు దేశాలు దిగి వ‌చ్చాయి. మిగ‌తా దేశాల విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

కాగా, తమ వ్యాక్సిన్‌ల(కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌) డిజిటల్‌ సర్టిఫికేట్‌ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్‌లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్‌ నిబంధనలను అమలు చేస్తామని భారత్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది.