పీసీఏ చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌

 గతంలో మాజీ ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో వివాదం నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తప్పించిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన రిటైర్డ్‌ జస్టిస్‌ వి కనగరాజ్‌ను ఆ పోస్టులో వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తిరిగి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎస్‌ఇసిగా బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆయన ఎన్ని అడ్డంకులు ఎదురైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఎస్‌ఇసి పదవి కోల్పోయిన కనగరాజ్‌కు సిఎం వైఎస్‌ జగన్‌ ఇప్పుడు మరో కీలక పదవి కట్టబెట్టారు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు పిసిఎలను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు మేరకు పిసిఎ (పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ)ను ఏర్పాటు చేస్తూ  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
దీనికి చైర్మన్‌గా కనగరాజ్‌ను నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు.
అథారిటీలో మరో ముగ్గురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. జిల్లా స్థాయిలోనూ ప్రభుత్వం పిసిఎ కమిటీలను ఏర్పాటు చేయనుంది. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి.
తెలంగాణలో సైతం ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని చైర్మన్‌గా నియమించాలని సుప్రీం కోర్టు నిబంధన పెట్టింది. పీసీఏలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌తోపాటు ఒక స్వచ్ఛంధ సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా వుంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు  చేస్తుంది. పీసీఏ  సిఫారసులను సర్కార్ కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయిస్తుంది.