`వైజాగ్ నాట్ ఫర్ సేల్’ నినాదంతో ఉద్యమం   

`వైజాగ్ నాట్ ఫర్ సేల్’ నినాదంతో ఉద్యమం   
విశాఖలో విలువైన ఆస్తులను అమ్మకానికి పెట్టడం వైసీపీ ప్రభుత్వ దివాలాకోరు విధానానికి నిదర్శనమని బీజేపీ  ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి మాధవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానంకు వ్యతిరేకంగా 1వైజాగ్ నాట్ ఫర్ సేల్’ అనే నినాదంతో ఉద్యమం చేపడతామని వెల్లడించారు. 
 
వైసీపీ ప్రభుత్వం దివాలా తీసిందని అందుకనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. బిల్డ్ ఏపీ పేరుతో గతంలో భూములు అమ్మాలని ప్రయత్నం చేశారని అంటూ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మొదటి రోజు నుంచి ఒక్క రూపాయి ఆదాయం తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని మాధవ్ ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా జగన్ మార్చారని మండిపడ్డారు. హెరిటేజ్ స్ట్రక్చర్ కలెక్టర్ ఆఫీసును అమ్మకానికి పెట్టడం దారుణమని విమర్శించారు. ఆస్తిపన్ను పెంచకుండా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
పేదవాడికి కష్టాలు తెలియని ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు.  తడి, పొడి చెత్తలపై పన్ను వేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని హితవు చెప్పారు . వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై చట్టపరంగా కూడా పోరాటం చేస్తామని, కోర్టులో పిల్ వేస్తామని మాధవ్ తెలిపారు.