ఇజ్రాయిల్ లో తొలిసారి ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వం 

ఇజ్రాయిల్ లో తొలిసారి ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వం 
ఇజ్రాయెల్‌లో మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. దీంతో సుదీర్ఘ కాలంగా(2009 నుంచి) ఇజ్రాయెల్‌ ప్రధానిగా ఉన్న నెతన్యాహూ శకం ముగియనున్నది. తీవ్రమైన అవినీతి ఆరోపణల మధ్య గద్దె దిగక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఎనిమిది పార్టీలు కూటమిగా ఏర్పడి నేషనల్‌ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు యెష్‌ అతీద్‌ పార్టీ నేత యేర్‌ ల్యాపిడ్‌ చెప్పారు. అంతకుముందు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు రైవ్‌లిన్‌కు కూటమి ఏర్పాటుపై సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
ప్రతిపక్ష నేత యాయిర్‌ లాపిడ్‌ నేతృత్వంలోని యేష్‌ అటిడ్‌ , నఫ్తాలి బెనెత్‌ సారథ్యంలోని యామినా తో సహా ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయించాయి. ఈ మేరకు వీటి మధ్య చివరి నిమిషంలో ఒక ఒప్పందం కుదిరింది.
దీని ప్రకారం కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి మొదటి రెండేళ్లు బెనెత్‌ సారథ్యం వహిస్తారు. మిగతా రెండేళ్లు లాపిడ్‌ ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇజ్రాయిల్‌ చరిత్రలోనే మొదటిసారిగా 21శాతం అరబ్‌ మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే ఒక అరబ్‌ పార్టీ (యునైటెడ్‌ అరబ్‌ లిస్ట్‌ ) సంకీర్ణ ప్రభుత్వంలో చేరనున్నది. ఈ మేరకు సంకీర్ణ భాగస్వాముల మధ్య ఒప్పందం కుదిరింది.
 
ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు ఇచ్చిన గడువు బధవారం అర్ధరాత్రితో ముగియనుండగా, దానికి 35నిముషాలు ముందు ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమంటూ ప్రతిపక్ష నేత యాయిర్‌ లాపిడ్‌ దేశాధ్యక్షుడు రీవెన్‌ రివ్‌లిన్‌కు ఒక ఇ-మెయిల్‌ పంపారు.  ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగించిన యత్నాల్లో విజయం సాధించామని చెప్పడానికి సంతోషిస్తున్నామని లాపిడ్‌ అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఇజ్రాయిల్‌ సాకర్‌ కప్‌ ఫైనల్‌కు హాజరైన అధ్యక్షుడు ఫోన్‌లో లాపిడ్‌కు అభినందనలు తెలిపారు. 
 
గడువులోగా కొత్త ప్రభుత్వం ఏర్పడని పక్షంలో ఇజ్రాయిల్‌ మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు గత రెండేళ్ళలో నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. నాల్గవ సారి కూడా ఎవరికీ మెజార్టీ లభించలేదు.నిర్దిష్ట గడువులోగా నెతన్యాహు ప్రభుత్వ ఏర్పాటులో విఫలమయ్యారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించాల్సిందిగా ప్రతిపక్ష నేత లాపిడ్‌కు అవకాశమిచ్చారు.

ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఈ సంకీర్ణ కూటమికి పార్లమెంట్‌లో మెజారిటీ చాలా స్వల్పంగా వుంది. మొత్తంగా 120మంది సభ్యులకు గానూ కొత్త సంకీర్ణానికి 61 మంది మద్దతు వుంది. కొత్త ప్రభుత్వం మరో 10 నుంచి 12 రోజుల్లో ప్రమాణం చేసే అవకాశం వుంది. ఈ లోగా ప్రతిపక్షాల్లో చీలికలు తెచ్చేందుకు నెతన్యాహు, ఆయన మిత్రులు రకరకాల ప్రయత్నాలు చేసే  అవకాశముంది. స్పీకర్‌ నెతన్యాహు నేతృత్వంలోని లీకుడ్‌ పార్టీకి చెందినవాడు కావడం వల్ల ఆయన స్థానంలో కొత్త స్పీకర్‌ను ఎన్నుకోవాలని ప్రతి పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. 

ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు రీవెన్‌ రివ్‌లిన్‌ పదవీకాలం వచ్చే నెలతో పూర్తి కానుంది. జులై 9న ఆయన పదవి నుండి వైదొలగుతున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ రాజకీయవేత్త ఇజాక్‌ హెర్జోగ్‌ నియమితులు కానున్నారు. పార్లమెంట్‌లోని 120 మంది సభ్యులతో మంగళవారం ఓటింగ్‌ జరిగింది. హెర్జోగ్‌కు 87 ఓట్లు లభించాయి. ఇజ్రాయిల్‌ లేబర్‌ పార్టీ మాజీ నేత, ప్రతిపక్ష నేత అయిన హెర్జోగ్‌ 2013లో నెతన్యాహుపై పోటీ చేసి ఓడిపోయారు.