ఫ‌స్ట్, సెకండ్ డోసులు ఒకే టీకా 

వ్యాక్సిన్ డోసుల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. రెండు డోసుల‌లోనే వ్యాక్సిన్ ఇవ్వ‌బ‌డుతుంద‌ని వెల్ల‌డించింది. కొవిషీల్డ్ టీకా మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత 12 వారాల‌కు రెండో డోస్ ఇస్తార‌ని, కొవాగ్జిన్ టీకాకు కూడా ఇదే షెడ్యూల్ వ‌ర్తిస్తుంద‌ని కేంద్ర ఆరోగ్య‌ శాఖ ప్ర‌క‌టించింది.

ఇక, వ్యాక్సిన్‌ల మిక్సింగ్ సాధ్యామా..? అసాధ్య‌మా అనే దానిపై అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌రిశోధ‌న జ‌రుగుతున్న‌ద‌ని, దానివ‌ల్ల హానిక‌ర రియాక్ష‌న్స్ వ‌చ్చే అవ‌కాశాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

అది ఒక ప‌రిష్కారం లేని సైంటిఫిక్ ప్ర‌శ్న అని, దానికి సైన్సే స‌మాధానం చెబుతుంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతానికి వ్యాక్సిన్‌ల మిక్సింగ్ ప్ర‌క్రియ ఉండ‌బోద‌ని, రెండు డోసులకు ఒకే వ్యాక్సిన్‌ను ఇస్తార‌ని స్ప‌ష్టంచేసింది.

ఇలా ఉండగా, దేశంలో క‌రోనా వ్యాక్సిన్‌కు కొర‌త లేద‌ని ఇండియ‌న్ కౌన్సిల్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. వచ్చే జూలై రెండో వారం లేదా ఆగ‌స్టు మొద‌టి వారం వ‌ర‌కు రోజుకు కోటి డోసుల చొప్పున ఇచ్చినా స‌రిపోయే అన్ని వ్యాక్సిన్ డోసులు ఉన్నాయ‌ని తెలిపింది. వ‌చ్చే డిసెంబ‌ర్ ఆఖ‌రుక‌ల్లా దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సినేష‌న్ పూర్త‌వుతుంద‌ని, అందులో ఏ మాత్రం సందేహం లేద‌ని ఐసీఎమ్మార్ వెల్ల‌డించింది.

ఇలా ఉండగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో కోటి మందికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో `మిషన్ జూన్‌`కు శ్రీకారం చుట్టింది. ఈ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను యూపీ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రారంభించారు.

యూపీలోని 75 జిల్లాల్లో కోటి మందికి టీకా పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. గ్లోబల్ టెండర్లలో భాగంగా త్వరలోనే 4 కోట్ల వ్యాక్సిన్ డోసులు యూపీకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకే భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించామని తెలిపారు.