భారతదేశం వైపు యురోపియ‌న్ యూనియ‌న్

ప్రస్తుత అత్యంత సవాలు సమయంలో భారతదేశం వైపు యురోపియ‌న్ యూనియ‌న్ ఉంటుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం జ‌రిగిన యురోపియ‌న్ స‌ద‌స్సుకు భార‌త ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ హాజ‌ర‌య్యారు. యురోపియ‌న్ కౌన్స‌ల్ అధ్య‌క్షుడు చార్లెస్ మిచెల్ ప్ర‌త్యేక ఆహ్వానం మేర‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మోదీ పాల్గొన్నారు. 

మొత్తం 27 మంది ఈయూ స‌భ్యులు, దేశాధినేత‌లు, ఇత‌ర పెద్ద‌లు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం నిర్వ‌హించారు. ఇండో-యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశాన్ని పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా నిర్వహించారు. “మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం గురించి చర్చిస్తాం. ఈయూ, ఇండియా క‌లిసి పనిచేయడం ద్వారా చాలా ఎక్కువ సాధించవచ్చు” అని ఈ సందర్భంగా డెర్ లేయన్ పేర్కొన్నారు.

కాగా, కోవిద్ వాక్సిన్ పై పేటెంట్ హక్కులను రద్దు చేయాలని భారత్, దక్షిణ ఆఫ్రికా చేసిన ప్రతిపాదనలకు  ఐరోపా యూనియన్ దేశాలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కోరారు. భారత్ – ఐరోపా యూనియన్ సంబంధాలు యూనియన్ లోని మొత్తం దేశాలతో బలపడాలని కోరుకొంటున్నట్లు చెబుతూ 21వ శతాబ్దంలో అంతర్జాతీయంగా మంచి జరగడానికి అవి దారితీయగలవాని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

పోర్చుగల్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహిస్తున్న‌ది. భారత-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలో పోర్చుగల్‌ను సందర్శించాల్సి ఉన్న‌ది. అయితే, కరోనా పరిస్థితులు మరింతగా దిగజారుతున్నందున వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు.

 పెరుగుతున్న కరోనా వ్యాప్తి గురించి ఈ సమావేశంలో చర్చ జరిపారు. భారతదేశం-ఈయూ నాయకుల సమావేశం మొదటిసారి EU + 27 ఫార్మాట్‌లో జరుగుతున్న‌ది. ఈ సంద‌ర్భంగా కరోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వారికి ఆత్మ‌శాంతి క‌లుగాలంటూ సంయుక్తంగా ప్రార్థ‌న చేప‌ట్టారు.