గుజరాత్ లో 8మంది పాక్ జాతీయుల అరెస్టు

గుజరాత్ లో 8మంది పాక్ జాతీయుల అరెస్టు
గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందిన జకావ్ తీరం సమీపంలో చేపల వేట కోసం ఉపయోగించే ఒక పడవలో ఉన్న 8 మంది పాకిస్తానీ జాతీయులు, 30 కిలోల హెరాయిన్‌ను గురువారం భారత కోస్తా గార్డు, గుజరాత్ తీవ్రవాద నిరోధక దళం సంయుక్తంగా పట్టుకున్నాయి. 
 
పాక్‌కు చెందిన ఒక పడవ ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరగనున్నట్లు మంగళవారం సమాచారం అందడంతో భారతీయ కోస్తా గార్డు(ఐసిజి) సిబ్బంది రంగంలోకి దిగి తీవ్రవాద నిరోధక సిబ్బందితో కలసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఐసిజి ఒక ప్రకటనలో తెలిపింది. 
 
బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత భారతీయ జలాలలోకి ప్రవేశించిన ఒక పాకిస్తానీ పడవను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. పడవలో లభించిన 30 కిలోల హెరాయిన్ విలువ దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని ఐసిజి పేర్కొంది.
 
గుజరాత్‌లోని సముద్ర తీరానికి ఈ సరకును చేరవేయాలన్నది పాకిస్తానీ స్మగ్లర్ల లక్షంగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలిపింది. పడవలో ఉన్న 8 మంది పాకిస్తానీ జాతీయులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఐసిజి వివరించింది.