భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను నూతన సీజేఐగా నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో నూతన సీజేఐగా ఎన్వీ రమణను నియమించారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
కాగా, తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఇటీవల సిఫారసు చేశారు. బోబ్డే తర్వాత ఎన్వీ రమణనే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉండటంతో ఆయన తదుపరి సీజేఐగా అవకాశం దక్కింది. జస్టిస్ ఎన్వీ రమణ 1957, ఆగస్ట్ 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
2017, ఫిబ్రవరి 14 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆరు నెలలపాటు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబర్ 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ప్రస్తుతం ఉన్నారు. జమ్మూ-కశ్మీరులో ఇంటర్నెట్ సస్పెన్షన్‌ను తక్షణమే సమీక్షించాలని రూలింగ్ ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ రమణ కూడా ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి పదవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పిన జడ్జీల ప్యానెల్లో కూడా ఆయన ఉన్నారు.

More Stories
విదేశాల్లోని వారి చేతుల్లో యువత `పావులు’గా మారారు!
సంఘ పనిని క్రొత్త పుంతలు త్రొక్కించిన మా.శేషాద్రీజీ
70 బిలియన్ డాలర్ల విదేశీ నిధులకై ఆశాభావం