వచ్చే జూన్  నాటికి  చంద్రయాన్-3 ప్రయోగం 

వచ్చే జూన్  నాటికి  చంద్రయాన్-3 ప్రయోగం 

చంద్రయాన్-3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్ నాటికి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ సెక్రటరీ డాక్టర్ కే. శివన్ తెలిపారు. చంద్రయాన్-2లో లోపాలను అర్థం చేసుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టామని చెప్పారు. 

గగన్‌యాన్ డిజైకూడా న్ తుది దశలో ఉందని, ప్రాజెక్టు రియలైజేషన్ ప్రారంభమైందని చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి తొలి మానవ రహిత మిషన్ కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

యూపీఈఎస్ విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్) విద్యార్థులు, ఫ్యాకల్టీని ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రయాన్-3, గగన్‌యాన్ ప్రాజెక్టుల గురించి శివన్ వివరించారు. రానున్న దశాబ్దంలో అనేక ఆధునిక సామర్థ్యాలను సొంతం చేసుకోవడానికి కృషి చేస్తోందని తెలిపారు. 

జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌కు 16 టన్నుల వరకు పేలోడ్స్‌ను మోసుకెళ్ళగలిగే హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికిల్‌ను తయారు చేయడం కూడా దీనిలో ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న జీఎస్ఎల్‌వీ ఎంకే3 లిఫ్ట్ కేపబిలిటీకి నాలుగు రెట్లు ఎక్కువ సామర్థ్యంతో ఈ వెహికిల్‌ను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పునర్వినియోగానికి అవకాశంగల వాహనాలను కూడా తయారు చేయబోతున్నట్లు శివన్ వెల్లడించారు. రాబోయే సంవత్సరంలోనూ, సమీప భవిష్యత్తులోనూ ఇస్రో చేపట్టబోతున్న కార్యక్రమాలను వివరిస్తూ, జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ) పేలోడ్ కేపబిలిటీ ప్రస్తుతం 4 టన్నులు ఉందని, దీనిని 5 టన్నులకు పెంచుతామని చెప్పారు.

ప్రస్తుత జీఎస్ఎల్‌వీ ఎంకే3 రాకెట్‌పై సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను ఉపయోగించి ఈ పేలోడ్ కేపబిలిటీని పెంచుతామని చెప్పారు. సెమీ క్రయోజనిక్ ఇంజిన్లు రాకెట్ గ్రేడ్ కిరోసిన్, లిక్విడ్ ఆక్సిజన్లను మండిస్తాయని, ఇటువంటి ఇంజిన్లు శక్తిమంతమైనవని, పర్యావరణ హితకరమైనవని, ధర కూడా తక్కువేనని చెప్పారు. 

పర్యావరణ హితకరమైన రాకెట్ ఇంధనాలను తయారు చేయడం కోసం లిక్విడ్ ఆక్సిజన్-మీథేన్, అటువంటి గ్రీన్ ప్రొపెల్లంట్స్‌పై పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్‌లను రీయూజబుల్ రాకెట్లలో విస్తృతంగా ఉపయోగిస్తారని వివరించారు. 

మీథేన్ ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మండుతుందని, కిరోసిన్‌కు ఆ లక్షణం లేదని వివరించారు. కాలుష్యానికి తావు లేకుండా మండటం వల్ల ఈ ఇంజిన్లను చాలా సార్లు ఉపయోగించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.