“బైంసా”  జర్నలిస్టులను ఆదుకోవాలి

 నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో గత  ఆదివారం (మార్చ 7న)  రాత్రి చెలరేగిన అల్లర్లలో కవరేజీకి వెళ్లి విచక్షణ రహితంగా కత్తిపోట్లకు, రాళ్లదాడికి గురైన జర్నలిస్ట్ లను ఆదుకోవాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేతలు డిమాండ్ చేశారు. ఆ మేరకు రాష్ట్ర హోంశాఖ మంత్రి  మహమూద్ అలీ.. డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. 

ఏ వర్గానికి సంబంధం లేకుండా తమ విధి నిర్వహణలో భాగంగా వివరాల సేకరణకు వెళ్లిన ముగ్గురిపై అల్లరిమూకలు దాడులు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో  భైంసాకు చెందిన రాజ్‌న్యూస్‌ రిపోర్టర్‌ విజయ్‌పై తీవ్రస్థాయిలో దాడి చేశారని, ఆయన బైక్‌ను తగులబెట్టారని, అనంతరం కత్తులతో నాలుగు చోట్ల పొడిచారని తెలిపారు. 

 ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉందని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి క్రైం రిపోర్టర్‌ ప్రభాకర్, లోకల్‌ చానల్‌ రిపోర్టర్‌ రవిని సైతం రాళ్లు, పంచ్‌లతో విచక్షణరహితంగా కొట్టడంతో వారు గాయాలపాలయ్యారని వివరించారు. ఈ ముగ్గురిపై దాడి చేయడమే కాకుండా వారి వాహనాలనూ తగులబెట్టడం దారుణం మని పేర్కొన్నారు. 

ఇదే ఘటనలో మరికొంతమంది రిపోర్టర్లనూ టార్గెట్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని  జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి తెలిపారు. వారం రోజులుగా డిజిపి కార్యాలయం చుట్టూ తిరిగిన కూడా అపాయింట్మెంట్ ఇవ్వక పోవడంతో,  దీంతో వినతిపత్రాన్ని డీజీపీ కార్యాలయంలో ఇన్ వార్డులో ఇచ్చి వచ్చామని త్లెఇపారు. 

తర్వాత రాష్ట్ర హోంశాఖ  మంత్రి మహమూద్ అలీ గారిని కలిసి సమస్యను వివరించి, వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించామని చెప్పారు. విధుల్లో భాగంగా వెళ్లిన ముగ్గురు పాత్రికేయులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సమాజానికి సమాచారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నవారిపై హత్యాయత్నం చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. దాడుల్లో గాయాలు కావడంతో పాటు తమ వాహనాలనూ కోల్పోయిన ముగ్గురు పాత్రికేయులకూ రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.

కత్తిపోట్లకు గురైన విజయ్‌కు ప్రభుత్వమే అన్ని ఖర్చులను భరించి, అత్యుత్తమ వైద్యాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనల్లో కవరేజీకి వెళ్లిన పాత్రికేయులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో  2020 సంక్రాంతి పర్వదినం రోజు, ఇదే బైంసాలో జరిగిన సంఘటనలను వెలుగులోకి తీసుకువచ్చిన సిద్ధూ అనే జర్నలిస్టుపై నమోదు చేసిన అక్రమ కేసు ఎత్తివేయాలని వారు కోరారు.