ఎబీవిపై ఏప్రిల్ ‌30లోగా దర్యాప్తు పూర్తి చేయండి 

నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల తో సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయనపై నమోదైన అభియోగాలపై ఏప్రిల్‌ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించింది.
సస్పెన్షన్‌ను ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూ డిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
వేగవంతంగా దర్యాప్తు పూర్తికావడానికి సహకరించాలని ఏబీ వెంకటేశ్వరరావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 3వ తేది కి వాయిదా వేస్తూ,  ఆ లోగా దర్యాప్తు నివేదిక అందించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది చందర్‌ ఉదయ్‌సింగ్‌ (సీయూ సింగ్‌ ) వాదనలు వినిపిస్తూ నిఘా పరికరాల కొనుగోలులో ఆయన కుమారుడికి లాభం జరిగేలా  అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఈ అంశంపై ఏబీసీ ఆయన కుమారుడిని కూ డా ప్రశ్నించిందని గుర్తు చేశారు.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం… ‘‘మీరు చెబుతున్న అభియోగాలన్నీ నిజమని అంగీకరిస్తున్నాం. అయితే, సస్పెండ్‌ చేసేంత పెద్ద కేసా ఇది?’’ అని ప్రశ్నించింది. టెండర్‌ డ్యాక్యుమెంట్లను తారుమారు చేసి ఆయన తన కుమారుడికి చెందిన సంస్థకు దాదాపు రూ.25.5 కోట్ల విలువైన ప్రాజెక్టును ఇచ్చారని సీయూ సింగ్‌ ఆరోపించారు.
మరోసారి జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ‘‘అది సరే.. కానీ అందుకు సస్పెండ్‌ చేయడం ఒక్కటే ఐచ్ఛికమా? వేరే విభాగంలో ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వవచ్చు కదా?’’ అని అడిగింది. దర్యా ప్తు పూర్తి చేయడానికి కనీసం 3 నెలల సమయం అ యినా ఇవ్వాలని సీయూ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఏబీ తరఫున సీనియర్‌ న్యాయవాది బీ ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. రోజువారీ దర్యాప్తును ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని తెలిపారు.