
మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ అధిపతి హెచ్ డి దేవెగౌడ ఈ నెల 19న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలలో కర్ణాటక నుండి పోటీచేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందిన ఆయన రాజ్యసభకు పోటీచేయనున్నట్లు జేడీఎస్ అధికారికంగా ప్రకటించింది.
తమ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యులతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమను అభ్యర్థించారని, అందుకే బరిలోకి దిగనున్నారని జేడీఎస్ ప్రకటించింది. మంగళవారం నామినేషన్ను దాఖలు చేస్తామని జేడీఎస్ నేతలు వెల్లడించారు.
అయితే జనవరిలో ఇదే విషయంపై స్వయంగా దేవెగౌడను అడగ్గా రాజ్యసభకు వెళ్లడానికి తనకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేయడం గమనార్హం. కర్నాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే దేవెగౌడకు మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తమ పార్టీ తొందర్లోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు.
మరోవంక కాంగ్రెస్ అభ్యర్థిగా గత లోక్ సభ లో పార్టీ పక్ష నాయకుడిగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే పోటీ చేయవచ్చని తెలుస్తున్నది. ఆయన కూడా గత లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం