రిజర్వ్ బ్యాంక్ గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏకంగా 165 టన్నుల విదేశాల్లో భద్రపరిచిన బంగారాన్ని విదేశీ వాల్ట్‌ల నుంచి వెనక్కి తెచ్చింది. దీంతో మొత్తం బంగారం నిల్వల్లో దేశీయంగా భద్రపరిచే వాటా 65.4 శాతం నుంచి 84 శాతానికి పెరిగింది. ఏడాది క్రితం భారత్‌లో 575.82 టన్నుల బంగారం ఉండగా ఇప్పుడు 740.13 టన్నులకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లోనే ఆర్బీఐ విదేశాల్లో ఉన్న 60.08 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది. మార్చి చివరికి దేశీయంగా 680.05 టన్నులుగా ఉన్న నిల్వలు సెప్టెంబర్ చివరికి 740.13 టన్నులకు పెరిగాయి. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బిఐఎస్) వద్ద ఉన్న భారత బంగారం 197.67 టన్నుల నుంచి 140.39 టన్నులకు తగ్గింది.
మొత్తం బంగారం నిల్వలు మాత్రం దాదాపు స్థిరంగా 880.18 టన్నుల నుంచి 880.52 టన్నులకు చేరాయి. అంటే కొత్త కొనుగోళ్ల కంటే విదేశాల్లో ఉన్న బంగారాన్ని వెనక్కి తీసుకురావడమే ప్రధానంగా కనిపిస్తుంది. 1990ల్లో విదేశీ మారక సంక్షోభ సమయంలో భారత్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టి 405 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది.
1991 నవంబర్లోనే రుణం తిరిగి చెల్లించినప్పటికీ తాకట్టు పెట్టిన బంగారాన్ని భారత్‌కు తరలించకుండా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్దే ఉంచింది. ఇలా విదేశాల్లో బంగారం నిల్వలు ఉంటే అంతర్జాతీయ చెల్లింపులు, వాణిజ్యం, స్వాప్ లావాదేవీలకు సులభంగా ఉపయోగించుకోవచ్చు. లండన్ ప్రపంచ బంగారం వ్యాపారానికి ప్రధాన కేంద్రం కావడంతో అనేక దేశాల కేంద్ర బ్యాంకులు అక్కడ నిల్వలను ఉంచుతాయి.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద సుమారు 4 లక్షల బంగారు ఇటుకలు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యా విదేశీ ఆస్తులను స్తంభింపజేశాయి. ఈ పరిణామం విదేశాల్లో ఉన్న జాతీయ ఆస్తుల భద్రతపై ఇతర దేశాల్లోనూ ఆందోళనలు రేకెత్తించింది. దీంతో విదేశీ వాల్ట్లపై ఆధారపడటాన్ని తగ్గించి, బంగారంపై దేశీయంగా ప్రత్యక్ష నియంత్రణ పెంచుకోవడంపై భారత్ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
విదేశాల్లో నిల్వ చేసిన బంగారాన్ని స్వదేశానికి తరలించడం వల్ల అవసరమైనప్పుడు వినియోగించుకోవడం సులభం కావడంతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిల్వల నిర్వహణలో రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. 2023లో భారత్ వద్ద 794.63 టన్నుల బంగారం ఉండగా, అందులో 493.54 టన్నులు విదేశాల్లోనే నిల్వ ఉండేది. ఆ తర్వాత దేశీయ నిల్వలను పెంచుకుంటూ వస్తుంది.
దేశీయంగా బంగారం నిల్వలు పెరిగినా వాటి విలువ తగ్గింది. మార్చి చివరి నాటికి బంగారం నిల్వల విలువ 115.40 బిలియన్ డాలర్ల ఉండగా.. సెప్టెంబర్ చివరికి 106.08 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఏప్రిల్‌లో ట్రాయ్ ఔన్స్ ధర 4,721 డాలర్లుగా ఉండగా సెప్టెంబర్‌లో 4,319 డాలర్లకు పడిపోయింది. అమెరికా బాండ్ రాబడులు పెరగడం, డాలర్ బలపడటం, కఠిన ద్రవ్య విధాన అంచనాలు ఇందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది.
విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా సైతం 16.70 శాతం నుంచి 14.38 శాతానికి తగ్గింది. అదే సమయంలో భారత్ విదేశీ మారక నిల్వలు మార్చి చివరి నాటి 691.11 బిలియన్ డాలర్ల నుంచి సెప్టెంబర్ చివరికి 737.78 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

More Stories
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతుపై భరోసా!
కొలీజియం సిఫార్సులు ఓ నిర్దిష్టవర్గంకే అనుకూలం
డ్రగ్స్‌కు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు