ఆధిపత్యం కోసం భారత్ అభివృద్ధి కోరుకొని ప్రపంచ శక్తులు 

ప్రపంచ శక్తులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తున్నందున భారతదేశం అభివృద్ధి చెందడాన్ని కోరుకోవడం లేదని, అయితే భారతదేశం తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు కూడా సహాయం చేయడంలో నమ్మకం ఉంచుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్  డా. మోహన్ భగవత్ తెలిపారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన ఐదవ పద్మోత్సవ ప్రారంభోత్సవంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ కార్యక్రమానికి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్ఞానజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం, వివిధ రంగాలకు చెందిన పద్మ పురస్కార గ్రహీతలను ప్రజలతో మమేకమయ్యేందుకు ఒకచోట చేర్చుతుంది.  నేడు ప్రపంచం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉందని డా. భగవత్ పేర్కొంటూ  “ప్రపంచంలో ఏ శక్తి కూడా భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదు, ఎందుకంటే ఆ శక్తులు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తాయి. ‘బలవంతుడే బతుకుతాడు’ అనే సూత్రాన్ని నమ్ముతాయి,” అని ఆయన తెలిపారు. 
 
“వారు అందరినీ ఒత్తిడిలో ఉంచుతారు. ఈ విధంగానే వారు శక్తివంతులుగా, ఇతరులపై పెత్తనం చెలాయించగలవారిగా పరిగణ పొంతుతారు. భారతదేశం అభివృద్ధి చెందితే, ఈ శక్తివంతుల ‘దుకాణాలు’ మూతపడతాయి.ఎందుకంటే భారతదేశం అందరికీ సహాయం చేయాలనుకుంటుంది,” అని ఆయన జోడించారు. 
 
భారతదేశం సహాయం చేసిన దేశాలను ప్రస్తావిస్తూ, ఆ దేశాలు తమ పట్ల శత్రుత్వంతో ఉన్నప్పటికీ, అవసరమైన సమయాల్లో పొరుగు దేశాలకు సహాయం చేసిందని భగవత్ గుర్తు చేశారు. “మాల్దీవులు కష్టాల్లో ఉన్నప్పుడు, భారతదేశం నీటిని రవాణా చేసింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు భారతదేశం ఆర్థిక సహాయం అందించింది. నేపాల్ పర్యావరణ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు భారతదేశం సహాయం చేస్తుంది. బంగ్లాదేశ్‌కు కూడా అండగా నిలుస్తుంది. వరదలు, భూకంపాల సమయంలో మేము పాకిస్థాన్‌కు కూడా సహాయం చేశాము,” అని ఆయన వివరించారు. 
 
బలహీనులను రక్షించడానికి, శాంతిని నెలకొల్పడానికి శక్తిని ఉపయోగించాలని భారతదేశం విశ్వసిస్తుందని భగవత్ పేర్కొన్నారు. “ఇదే భారతదేశం,” అని ఆయన చెప్పారు. యువతరం బానిసత్వ ప్రభావాల నుండి విముక్తి పొందిందని కూడా ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి కోరారు. 
 
“ఎవరైనా నిజాయితీగా మాట్లాడితే, యువత వారికి అండగా నిలబడటానికి సిద్ధంగా ఉంటారు. వారు అబద్ధాలను ద్వేషిస్తారు. తమ దేశాన్ని గొప్పగా చేయాలని కోరుకుంటారు. యువత ప్రతి విషయంలోనూ ఈ విధంగానే ఆలోచిస్తున్నారు,” అని ఆయన తెలిపారు. లక్ష్యాలను సాధించాలంటే మంచి పనులను ఆదర్శంగా తీసుకోవాలని భగవత్ సూచించారు. 
 
“మంచి పనులు చేస్తున్న వ్యక్తులపై మనకు నమ్మకం ఉండాలి. వారి ఉద్దేశాలను ప్రశ్నించకూడదు. వారి కృషిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా స్వార్థంతో ఏదైనా పని చేసినప్పటికీ, ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి, వారు చేసిన మంచి పనిని మనం అనుసరించాలి. రాబోయే తరాల వారు వారి బాటలో పయనిస్తే, వారికి గొప్ప సంతృప్తి లభిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. 
 
పద్మ పురస్కార గ్రహీతలు ఎంతో దృఢ సంకల్పంతో పనిచేసి, లక్షలాది మంది జీవితాల్లో మార్పులు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. “వారు ఎంత సంపాదించారనే దానికంటే, వారికి లభించిన సంతృప్తి వెలకట్టలేనిది. ఇలాంటి గొప్ప వ్యక్తులతో నేరుగా సంభాషించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడి ప్రజలకు లభించింది” అని భగవత్ తెలిపారు.
 
జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతం) లక్ష్యాన్ని సాధించడంలో యువత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని, వారే దీనివల్ల అత్యధిక ప్రయోజనాలను పొందుతారని తెలిపారు. “2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, యువత అత్యధిక సహకారాన్ని అందించాలి. అదే సమయంలో వారే దీని ద్వారా అత్యధిక లబ్ధిని కూడా పొందుతారు. ఈ కలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. గతంలో మనం సాధించిన విజయాల నుండి పాఠాలు నేర్చుకుంటూ, మన మేధోశక్తిని మరింతగా వెలికితీయాలి” అని ఆయన పేర్కొన్నారు. 
 
అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని కూడా జనరల్ చౌహాన్ హెచ్చరించారు. ఇతర దేశాలకు భారత్ అందిస్తున్న సహాయ సహకారాలు, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడంలో యువత పాత్ర, పద్మ పురస్కార గ్రహీతల కృషి వంటి అంశాలను ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చాటిచెప్పింది.

About The Author