కృష్ణా జలాల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం 

కృష్ణా జలాల పంపిణీపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం మరోసారి ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. తమ రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా కృష్ణా జలాల కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు తమ తమ వాదనలను బలంగా వినిపించడంతో భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి

హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్వహించిన సమావేశం నీటి కేటాయింపులు, నాగార్జునసాగర్‌ నుంచి తాగునీటి అవసరాలకు నీటి విడుదల, రెండు రాష్ట్రాల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక అంగీకారానికి రాలేకపోయారు. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్‌ కాంబోజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు రమేష్‌బాబు, నరసింహమూర్తి హాజరయ్యారు. 

చర్చల్లో భాగంగా మొత్తం 19 డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరింది. మరోవైపు ప్రస్తుత అవసరాల కోసం తమకు 21 టీఎంసీల నీరు కావాలని తెలంగాణ తన వాదనను వినిపించింది. నాగార్జునసాగర్‌ నుంచి తాగునీటి అవసరాల కోసం 9 టీఎంసీల నీటిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ కేఆర్‌ఎంబీని కోరింది. ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 

అయితే, ఇప్పటికే ఏపీ తనకు కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వినియోగించుకుందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఈ పరిస్థితుల్లో అదనంగా 9 టీఎంసీల నీటిని కేటాయించడంపై తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు తమ వాటాల విషయంలో పట్టుబట్టడంతో తుది నిర్ణయం వాయిదా పడింది

సమావేశంలో పట్టిసీమ వాటర్‌ గ్రిడ్‌ అంశాన్ని కూడా తెలంగాణ లేవనెత్తినట్లు సమాచారం. మరోవైపు, గ్రామీణ నీటిసాగు పథకం పనుల గురించి తమకు తెలియదని ఏపీ జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఇలా పలు అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. అయితే నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కృష్ణా జలాల పంపిణీ వివాదంపై మరోసారి ప్రతిష్ఠంభన కొనసాగింది.

నీటి విడుదల అంశంతో పాటు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. అయితే, ఆ ప్రాంతంలో జరుగుతున్న గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) పనుల వివరాలపై తమకు స్పష్టమైన సమాచారం లేదని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

About The Author