రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ నిమ్స్‌లో ఆపరేషన్ థియేటర్ల వద్ద సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య పరికరాలను అనధికారికంగా నిల్వ చేయడం నుంచి, రోగి ఒక్కరికి వారంలో 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో చూపించడం వరకు పలు అసాధారణ లెక్కలు బయటపడ్డాయి. చివరకు రోగులు మరణించిన మూడు నెలల తర్వాత కూడా వారి పేర్లపై బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తించారు. నిమ్స్‌లోని పలు విభాగాల్లో జరిగిన ఈ వ్యవహారాలను ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో గుర్తించింది.
వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అనుమతితోనే ఈ నిల్వలు కొనసాగినట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రధాన స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టి సామగ్రి తీసుకోవాల్సి ఉండగా, నేరుగా సరఫరాదారుల నుంచే ఇంప్లాంట్లు తీసుకుంటున్నట్లు ఏసీబీ పేర్కొంది. వినియోగం తర్వాత యుటిలైజేషన్ సర్టిఫికెట్ తయారు చేసి, సరఫరాదారుల బిల్లులతో కలిపి ప్రధాన స్టోర్‌కు పంపుతున్నట్లు గుర్తించారు. వాస్తవంగా వినియోగించని ఇంప్లాంట్లకు కూడా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సృష్టించి బిల్లులు పొందే అవకాశం ఉందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత బిల్లులు ప్రాసెస్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
ముఖ్యంగా ప్రభుత్వమే చెల్లింపులు చేసే ఆరోగ్యశ్రీ పథకం రోగుల విషయంలో ఈ తరహా లెక్కలు కనిపించినట్లు తెలిపింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగుల డిశ్చార్జి అనంతరం సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లింగ్ నమోదైనట్లు ఏసీబీ తన ప్రకటనలో పేర్కొంది. శస్త్రచికిత్సలకు వినియోగించే వస్తువుల లెక్కల్లోనూ అసాధారణ వినియోగం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఒకే రోగికి ఒక వారంలో 800 గ్లౌజులు వినియోగించినట్లు రికార్డుల్లో చూపించడం ఇందుకు ఉదాహరణగా ఏసీబీ పేర్కొంది.
ఈ తరహా అవకతవకల్లో అధిక భాగం ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు సంబంధించినవేనని తెలిపింది. నిమ్స్ ప్రధాన క్యాంటీన్లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అవసరమైన ఆహార భద్రతా నమోదు కూడా లేకుండానే క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. మ్యాన్‌పవర్, మెడికల్ షాపుల టెండర్లపై నిఘా 2019 నుంచి 2025 వరకు మ్యాన్‌పవర్ సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు.
కార్మికుల నియామకాలు, వారిని సెమీ స్కిల్ కేటగిరీకి మార్చిన విధానంలో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు పేర్కొన్నారు. మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా నిర్వహించాల్సిన అమ్మకాల రికార్డులు లేకపోవడం, నమోదుకాని సిబ్బందితో పని చేయించడం వంటి అంశాలు బయటపడ్డాయి. నిబంధనలు ఉల్లంఘించిన ఓ సంస్థకు సంబంధించిన రూ.28.13 లక్షల బ్యాంకు గ్యారంటీని జప్తు చేయకపోవడాన్ని కూడా తనిఖీ నివేదికలో ప్రస్తావించింది.

More Stories
హైదరాబాద్‌లో రద్దీ రహదారులపై ‘కంజెషన్ ఛార్జీలు’!
కృష్ణా జలాల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం
‘సర్’ పై రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం