మహారాష్ట్రలో రూ.5,675 కోట్ల `అదానీ’ పనులు నిలిపివేత!

పర్యావరణ నిబంధనలు, అవసరమైన అనుమతులు పాటించకుండా తవ్వకాలు, నిర్మాణ పనులు చేపట్టినట్లు గుర్తించిన మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) అదానీ గ్రూప్‌కు చెందిన భారీ విద్యుత్‌ ప్రాజెక్టు పనులకు వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.  సతారా జిల్లాలోని సావర్‌ఘర్‌ గ్రామంలో జరుగుతున్న పనులకు సంబంధించి అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ వన్‌ లిమిటెడ్‌కు ఈ మేరకు స్టాప్‌ వర్క్‌ నోటీసు జారీ చేసింది.
రూ.5,675 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 1,500 మెగావాట్ల తరళి ఓపెన్‌ లూప్డ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై ఈ చర్య తీసుకుంది.
తరళి ప్రాజెక్టు కోసం తాత్కాలిక కార్మిక శిబిరం, నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఈ పనులు చేపట్టినట్లు సంస్థ గతంలో తెలిపింది. 
అయితే ఈ కార్యకలాపాల గురించి కాలుష్య నియంత్రణ మండలికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, అవసరమైన అనుమతులు కూడా పొందలేదని తనిఖీ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా తవ్వకాలు, భూమి అభివృద్ధి పనులకు సంబంధిత అధికారుల నుంచి పర్యావరణ అనుమతి కూడా తీసుకోలేదని గుర్తించింది.
 
సావర్‌ఘర్‌లో పెద్ద ఎత్తున అనధికారిక తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయని సతారా వన్యప్రాణి సంరక్షణ అధికారి రోహన్‌ భాటే ఈనెల 19వ తేదీన ఎంపీసీబీ మెంబర్‌ సెక్రటరీ రాహుల్‌ రేఖావర్‌కు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకుని స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 2025 ఫిబ్రవరి 11వ తేదీన జారీ చేసిన పర్యావరణ అనుమతిలో ప్రభావిత గ్రామాలుగా నివాడే, తొండోషి, కలంబే, జాలు మాత్రమే ఉన్నాయని, సావర్‌ఘర్‌ పేరు లేదని ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు.

దీంతో ప్రాంతీయ అధికారి కిరణ్‌ హసబ్నిస్‌ ఈనెల 20వ తేదీన స్టాప్‌ వర్క్‌ నోటీసు జారీ చేశారు.  అదానీ సంస్థకు 2025 ఏప్రిల్‌ 7వ తేదీన నిర్మాణ అనుమతి ఇచ్చిన విషయాన్ని కూడా నోటీసులో ప్రస్తావించింది. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన నిబంధనల ప్రకారం నిర్వహణ అనుమతులు, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు మంజూరైనట్లు పేర్కొంది.

అయితే అనుమతులు పొందినంత మాత్రాన పర్యావరణ పరిరక్షణ నిబంధనలను విస్మరించడానికి వీల్లేదని కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న, ప్రతిపాదించిన తవ్వకాలు, నిర్మాణ పనులన్నింటినీ తక్షణమే నిలిపివేయాలని, ఎంపీసీబీ ముందస్తు అనుమతి లేకుండా తిరిగి ప్రారంభించకూడదని ఆదేశించింది. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఎంపీసీబీ నోటీసుపై అదానీ సంస్థ స్పందిస్తూ సంబంధిత వాస్తవాలు, వివరణలతో కాలుష్య నియంత్రణ మండలికి సమాధానం సమర్పిస్తున్నట్లు తెలిపింది. 

About The Author