కేవలం 14 ఏళ్ల బాలుడు ఏకంగా అగ్నివీర్ రిక్రూట్మెంట్ పోర్టల్‌లోని డేటాను హ్యాక్ చేసి డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని గుర్తించిన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. సుమారు 2500 మందికి పైగా అగ్నివీర్ సిబ్బందికి సంబంధించిన రికార్డులు తన వద్ద ఉన్నాయని చెబుతూ వాటిని క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు తీసుకుని విక్రయించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.
ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సైబర్ విభాగం డార్క్ వెబ్‌ను పర్యవేక్షిస్తున్న సమయంలో ఓ ఖాతా అనుమానాస్పదంగా కనిపించింది. కేంద్ర హోంశాఖకు చెందిన అగ్నివీర్ రిక్రూట్మెంట్ పోర్టల్ అడ్మిన్ లాగిన్ వివరాలను విక్రయిస్తామంటూ అందులో ప్రకటన కనిపించింది. దీంతో పోలీసులు ఆ ప్రకటన వెనుక ఉన్నది 14 ఏళ్ల బాలుడిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వార్తా కథనాలు పేర్కొన్నాయి.
సదరు బాలుడు డార్క్ వెబ్‌లో డేటాను విక్రయించేందుకు క్రిప్టోకరెన్సీ రూపంలో 500 డాలర్లు (సుమారు రూ.50 వేలు) ధర నిర్ణయించినట్లు సమాచారం. కొనుగోలుదారులు తనను సంప్రదించేందుకు డిస్కార్డ్, టెలిగ్రామ్ అకౌంట్ వివరాలను కూడా అందులో పొందుపరిచినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
బాలుడు విక్రయానికి పెట్టినట్లు చెబుతున్న డేటా అత్యంత కీలకమైనదిగా తెలుస్తోంది.
సుమారు 47 ప్రభుత్వ విభాగాలకు చెందిన 2,500 మందికి పైగా అగ్నివీర్ సిబ్బంది రికార్డులు తన వద్ద ఉన్నాయని ఆ బాలుడు పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా పోర్టల్ అడ్మిన్ ప్యానెల్‌కు పూర్తి యాక్సెస్, ఏపీఐ డీక్రిప్షన్ కీ, సింగిల్ సైన్-ఆన్ (ఎస్ఎస్ఓ) ఇంటిగ్రేషన్ వివరాలు, బ్యాక్ఎండ్ రూట్ మ్యాప్, డేటా నిర్వహణకు అవసరమైన స్క్రిప్టులు కూడా అందిస్తానని ప్రకటనలో పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
అడ్మిన్ ప్యానెల్లో యూజర్ మేనేజ్మెంట్, సంస్థల వివరాలు, పోలీస్ స్టేషన్లు, నివేదికలు, ఫిర్యాదులు, ఉద్యోగ దరఖాస్తులు, లేఖలు, డేటా దిగుమతి, ఎగుమతి వంటి విభాగాలకు యాక్సెస్ ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖకు చెందిన కెరీర్ ప్రోగ్రెషన్ పోర్టల్‌లోని లోపాలను గుర్తించి బాలుడు అనధికారికంగా ప్రవేశించి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ పోర్టల్ ప్రధానంగా నాలుగేళ్ల అగ్నివీర్ సేవ పూర్తి చేసుకున్న తర్వాత ఇతర ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ఉపయోగపడేలా రూపొందించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్, రాష్ట్ర పోలీసు విభాగాలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల్లో ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించడం దీని ఉద్దేశం. అయితే బాలుడు నిజంగానే పోర్టల్‌ను హ్యాక్ చేసి డేటాను సేకరించాడా లేక ఇతర మార్గాల్లో సమాచారం పొందాడా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

More Stories
950 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్..!
మహారాష్ట్రలో రూ.5,675 కోట్ల `అదానీ’ పనులు నిలిపివేత!
ఆగస్టు 15న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం