ఆగస్టు 15న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం

వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న ‘బి28’ బుల్లెట్ ట్రైన్ కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ తుది కసరత్తు జరుగుతోంది. ముందుగా సూరత్- వాపి విభాగంలో తొలి సర్వీసును ప్రారంభిస్తామని, ఆ తర్వాత దశలవారీగా ముంబయి వరకు పూర్తి కారిడార్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. 
 
ఈ తొలి బుల్లెట్ ట్రైన్‌కు బి28 అని పేరు పెట్టారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎంఎల్) సంస్థలు సంయుక్తంగా ఈ స్వదేశీ రైలును తయారు చేస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్ మొత్తం పొడవు సుమారు 202 మీటర్లు ఉంటుంది. దీంట్లో 8 కోచ్‌లు ఉంటాయి. నాలుగు మోటార్ కార్లు, నాలుగు ట్రైలర్ కార్లతో రైలు నిర్మాణం ఉంటుంది.
 
ఒకేసారి సుమారు 557 మంది ప్రయాణించవచ్చు. దీంట్లో 3×2 సీటింగ్ అరెంజ్‌మెంట్స్‌తో 7 స్టాండర్డ్ క్లాస్ కోచ్‌లు, 2×2 సీటింగ్‌తో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ ఉంటాయి. సూరత్-బిలిమోరా సెక్షన్‌ ప్రారంభించాక.. వాపి-సూరత్ ప్రారంభమవుతుందన్నారు. ఆ తర్వాత వాపి-అహ్మదాబాద్, అహ్మదాబాద్-థానే మార్గాలు మొదలవుతాయన్నారు. చివరగా అహ్మదాబాద్-ముంబై సెక్షన్‌లను ప్రారంభిస్తామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 
 
ఈ కారిడార్ మొత్తం 508 కిలోమీటర్లు ఉంటుంది. డిసెంబర్ 2029 నాటికి ఈ కారిడార్ పనులన్నీ పూర్తై పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దేశంలో మొత్తం ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలుత ముంబై-అహ్మదాబాద్ కారిడార్ ప్రారంభం కానుంది. అనంతరం మిగతా కారిడార్ల పనులు ప్రారంభం కానున్నాయి. 
 

About The Author