భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యాయవాదిపై ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. జస్టిస్‌లు దీపాంకర్ దత్తా, జయమల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ న్యాయవాది నుంచి స్పందన కోరింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 20కు వాయిదా వేసింది.
“మా ముందున్న పత్రాలను పరిశీలించిన మీదట, ధిక్కార చట్టంలోని సెక్షన్ 15(1)(బి) కింద అటార్నీ జనరల్ (ఏజీ) ఇచ్చిన సమ్మతి కూడా అందులో ఉంది. పిటిషన్‌లో పేర్కొన్న ఏకైక ప్రతివాదిపై వాదనలు ప్రారంభించాలంటూ ఎస్‌సీబీఏ దాఖలు చేసిన పిటిషన్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మేము ప్రాథమికంగా సంతృప్తి చెందాము. జనవరి 20, 2027న తిరిగి హాజరుకావాల్సిన నోటీసును జారీ చేస్తున్నాము,” అని ధర్మాసనం పేర్కొంది.
సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ) తరఫున హాజరైన ఆ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్, ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సమర్పించారు. సోమవారం జరిగిన ఒక అసాధారణ పరిణామంలో, సీజేఐపై నిరాధారమైన, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక న్యాయవాదిని సుప్రీంకోర్టు కోర్టు గది నుండి బయటకు పంపించారు.
సోమవారం మధ్యాహ్నం సీజేఐ, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ మోహనలతో కూడిన ధర్మాసనం సమావేశమైన అనంతరం, ఆ న్యాయవాది ఒక ప్రత్యేక అనుమతి కోరారు. నవంబర్ 2న తాను పంపిన లేఖపై ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం నుండి ఎటువంటి స్పందన రాలేదని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై వెంటనే విచారణ చేపట్టాలని ఆ న్యాయవాది అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
“మీరు ఇలాంటి విషయాలను ప్రస్తావించకూడదు” అని జస్టిస్ మోహన పేర్కొన్నారు. ఆ న్యాయవాది పట్టుబట్టడంతో, ప్రధాన న్యాయమూర్తి, “చూద్దాం, మీరు కొంచెం వేచి ఉండండి” అని చెప్పారు. అయితే న్యాయవాది వెనక్కి తగ్గకుండా సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను వేచి ఉండను. మీరు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హులు కాదు. ఆ పదవికి తగిన నిజాయతీ మీకు లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ పరిణామంతో కొంతసేపు కోర్టు వర్చువల్ విచారణలు నిలిచిపోయాయి. అనంతరం కోర్టు హాలులో ఉన్న భద్రతా సిబ్బంది సదరు న్యాయవాదిని బయటకు తీసుకెళ్లారు. దీనితో, కోర్టు వర్చువల్ విచారణ ప్రక్రియను కొంతసేపు నిలిపివేశారు.
More Stories
యుపి ఎస్ఎస్ఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో19 లక్షల కొత్త ఓటర్లు
ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు ముగింపు
యమునా కాలుష్యంపై అధికారులకు జరిమానాలు!