ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్రకు ముగింపు

ఉత్తరాఖండ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ బద్రీనాథ్‌ ధామ్ ఆలయ తలుపులను శీతాకాలం సందర్భంగా సోమవారం రాత్రి 9.37 గంటలకు సంప్రదాయ పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య మూసివేశారు. దీంతో ఈ ఏడాది బద్రీనాథ్‌ యాత్ర అధికారికంగా ముగిసింది. ఆలయ తలుపుల మూసివేత కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ద్వారాలు మూసివేయడానికి ముందు నిర్ణీత సంప్రదాయ పూజలు నిర్వహించారు. 

సంప్రదాయం ప్రకారం ముందుగా గర్భగుడిలో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించిన అనంతరం బద్రీ విశాల్‌ స్వామి ఆలయ ద్వారాలను శీతాకాలం కోసం మూసివేశారు. బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు మూసివేయడంతో 2026 చార్‌ధామ్‌ యాత్ర కూడా అధికారికంగా ముగిసిందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.  ఈ ఏడాది దేశవిదేశాల నుంచి 65 లక్షల మందికి పైగా భక్తులు నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారని తెలిపారు. 

ఒక్క బద్రీనాథ్‌ ధామ్‌ను మాత్రమే 23 లక్షల మందికి పైగా సందర్శించారని, ఇది కొత్త రికార్డుగా నిలిచిందని పేర్కొన్నారు. దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర భక్తి, విశ్వాసాలకు కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ధామి తెలిపారు.  బద్రీ విశాల్‌ స్వామిపై కోట్లాది మంది భక్తులకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి ఈ భారీ భక్తుల రాక నిదర్శనమని పేర్కొన్నారు. 

ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు, సిరిసంపదలు, ఆరోగ్యం కలగాలని బద్రీనారాయణుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ నెల 11న కేదార్‌నాథ్‌ ధామ్‌ ఆలయ ద్వారాలను కూడా శీతాకాలం కోసం మూసివేశారు. ఉదయం 8.30 గంటలకు సంప్రదాయ పూజలు, వేద మంత్రోచ్ఛారణలు, సైనిక బ్యాండ్‌ వాయిద్యాల మధ్య ఆలయ ద్వారాలను మూసివేశారు. 

ఈ ఏడాది కేదార్‌నాథ్‌ను 19.20 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధ్యక్షుడు హేమంత్‌ ద్వివేది తెలిపారు. ఆలయ ద్వారాలు మూసివేసే చివరి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శీతాకాల విరామం అనంతరం వచ్చే ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా కేదార్‌నాథ్‌ ఆలయాన్ని తిరిగి తెరిచే అవకాశం ఉంది.

About The Author