యమునా కాలుష్యంపై అధికారులకు జరిమానాలు!

యమునా నదిని శుభ్రపరచడానికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ, దాని పరిస్థితి మరింత దిగజారిందని గమనించిన సుప్రీంకోర్టు, నదిలో కాలుష్యం మరింత తీవ్రమైతే, ఆ నదీ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను (యూటీలను) ఆర్థిక జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమైనందుకు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం పౌర అధికారులను విమర్శించింది. 
 
దాదాపు 520 మురుగు కాలువలు యమునా నదిలోకి మురుగునీటిని వదులుతున్నాయని కూడా పేర్కొంది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం,  జిల్లాలో నది, ప్రధాన మురుగు కాలువలు ప్రవేశించే, నిష్క్రమించే ప్రదేశాలలో నీటి నాణ్యతను పర్యవేక్షించాలని కోర్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)ని ఆదేశించింది. నది దుస్థితి దాని ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు,  గ్రామాల పౌర పరిపాలన లోపాలను ప్రతిబింబిస్తోందని ధర్మాసనం గమనించింది. 
 
“నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాలలో పౌర పరిపాలనలో ఉన్న లోపాలన్నీ నది యొక్క దుస్థితిలోనూ, యమునా నదిలోకి మురుగునీటిని వదిలే 520మురుగు కాలువలలోనూ ప్రతిఫలిస్తున్నాయి. అందుకే, నదిని శుభ్రపరచడానికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నప్పటికీ, యమునా నదిలో కాలుష్యం మాత్రమే పెరిగింది,” అని ధర్మాసనం పేర్కొంది. పారిశ్రామిక కాలుష్యం, శుద్ధి చేయని మురుగునీటిపై, వాటిని మూలం వద్ద “పూర్తిగా ఆపలేకపోయినా” అరికట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
 
అది సాధ్యం కాని చోట, మురుగునీటిని ముందుగా గుర్తించి, ఆ తర్వాత శుద్ధి చేయాలి. అయితే, పటిష్టమైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడం, వర్షపునీటి కాలువలు, మురుగునీటి కాలువలు కలిసి ఉండటం వల్ల ఈ గుర్తింపు ఒక సవాలుగానే మిగిలిపోతుందని కోర్టు పేర్కొంది.   
 
“ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2047లో నిర్వచించిన జోన్ ‘ఓ’ను ‘గ్రీన్’ జోన్‌గా నిర్వహించి, పరిరక్షించడమే కాకుండా, సాధ్యమైతే దానిని ఎగువ, దిగువ ప్రాంతాలకు, అంటే యమునా నది పుట్టిన చోటు నుండి గంగానదితో కలిసే సంగమ స్థానం వరకు విస్తరించాలని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. గ్రీన్ పార్కులు, అత్యవసర ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మినహా, భవిష్యత్తులో సదరు లేదా విస్తరించిన జోన్‌లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదు,” అని అది పేర్కొంది. 
 
వినోద, పర్యాటక ప్రయోజనాల కోసం కూడా, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల వంటి పాక్షిక శాశ్వత నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. శాశ్వత నిర్మాణాలను జోన్ ‘ఓ’ వెలుపల, అది కూడా తగిన ఎత్తులో మాత్రమే నిర్మించవచ్చు. ప్రస్తుత చట్టానికి అనుగుణంగా, నివాసితులకు అర్హత ఉన్నచోట ప్రత్యామ్నాయ వసతిని కేటాయించిన తర్వాత, జోన్ ‘ఓ’లో లేదా ప్రతిపాదిత విస్తరించిన జోన్‌లో ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి,” అని అది జోడించింది.

About The Author