వరంగల్ కోటలో సర్వాయి పాపన్న శిల్పం

వరంగల్ కోటలో సర్వాయి పాపన్న శిల్పం ఉన్నట్లు చారిత్రక ఆధారాలతో సహా గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం వెల్లడించింది. కోటలో గుర్తించిన వివరాలను బృందం పరిశోధక సభ్యులు బైరోజు చంద్రశేఖర్, డా. బైరోజు శ్యాంసుందర్, హనుమన్నగారి వేమారెడ్డి, పండ్రాప్రగ్గడ రామారావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.గుర్తించిన వివరాల ప్రకారం.. సర్వాయి పాపన్న 1708 ఏప్రిల్ 1కు ముందు రోజు, అంటే మార్చి 31న, 3 వేల మంది కాల్బలం, 500 మంది అశ్వ సైన్యంతో కోటగోడల వద్దకు చేరుకుని కాపుకాశారు. 
 
కొంత సైన్యం దారులను మూసి కాపుకాయగా, మరికొంత సైన్యం తాళ్లతో కోటగోడల మీదికి చేరుకుంది. కోట తలుపులను బద్దలుకొట్టి పాపన్న సైన్యంతో వరంగల్ కోటలోకి చొరబడ్డారు.  రెండు, మూడు రోజులు పాపన్న సైన్యం దుకాణాలు, వ్యాపారులు, వరంగల్ వాసుల నుంచి పెద్ద ఎత్తున ధనం, వస్త్రాలను తీసుకుంది. వందల మంది ఉన్నత వ్యక్తులను ఖిలాషాపూరుకు తీసుకువెళ్లి కోటలో నిర్బంధించింది. 
 
నిర్బంధించిన వారిలో స్త్రీలు, పిల్లలు, వరంగల్ న్యాయాధీశుడు, ఆయన భార్యాపిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ నిర్బంధించి పాపన్న కావాల్సినంత ధనం సేకరించుకున్నారని బృందం తెలిపింది.సేకరించిన ధనంతో పాపన్న సైన్యానికి అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారని పేర్కొంది. లభించిన ఆధారాల మేరకు 700 డబుల్ బ్యారెల్ మస్కట్లు, డచ్, ఇంగ్లీషు వ్యాపారుల వద్ద అవసరమైన యుద్ధ సామగ్రిని కొనుగోలు చేశారని తెలిపింది. 
 
ఈ విజయంతో పాపన్న రాజు హోదాను పాటిస్తూ పల్లకీ సేవలు, ప్రత్యేక సైన్యం, ప్రత్యేక గుర్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని వివరించింది. వరంగల్ కోట పడమటి ద్వారం వద్ద కుడిచేత కైజారు, ఎడమచేత మస్కట్ తుపాకి, బొడ్డులో కత్తితో, వీరకాసె పోసి నిల్చున్న వీరుడికి ఎడమవైపు సిగ ఉంది. మెడలో కంటె ఉంది. పెద్ద మీసాలు, భారీ కాయంతో కనిపిస్తున్న ఈ శిల్పం చారిత్రక సందర్భంతో ముడిపడి ఉందని బృందం పేర్కొంది. శిల్పం శైలిని బట్టి ఇది 17వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నామని, ఈ విగ్రహం సర్వాయి పాపన్నదేనని ప్రకటనలో ధ్రువీకరించింది. 

 

About The Author