బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా కొనసాగుతున్న ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’ సదస్సు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కార్యక్రమ ముగింపు సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. అయితే ఆయన పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.

రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు చేపట్టాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం తార్నాకలోని రాంచందర్‌రావు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధంలో ఉంచారు. ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

తనను హౌస్ అరెస్ట్ చేయడంపై రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ హాజరవుతున్న ‘భారత్ సమ్మిట్’ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే సదస్సు ఎంతమాత్రం కాదని, ఇది కేవలం భారతదేశ అంతర్గత రాజకీయ పరిస్థితులపై విదేశీయులను పిలిపించి చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ పెట్టిన కార్యక్రమమని విమర్శించారు. 

రాష్ట్రంలో రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నా పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం, ప్రజల సొమ్మును వెచ్చించి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం దారుణమని ధ్వజమెత్తారు. భారతదేశంపై, ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంపై ప్రపంచానికి తప్పుడు సమాచారం ఇచ్చి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ సదస్సుకు విదేశాల నుంచి వచ్చిన వారిలో సగానికి పైగా గతంలో భారతదేశ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించిన వారే ఉన్నారని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

 “భారత్ సమ్మిట్” ముసుగులో విదేశీ అతిథులను ఆహ్వానించి దేశ కీర్తి ప్రతిష్టలను, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కించపరిచే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశ వ్యతిరేక శక్తులతో కలిసి ఈ సదస్సు నిర్వహిస్తున్నారని, రాహుల్ గాంధీని రాజకీయంగా పునరుద్ధరించేందుకే (రీలాంచ్) దీనిని ఒక వేదికగా మార్చుకున్నారని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.

తమ పార్టీ అధ్యక్షుడిని అక్రమంగా గృహనిర్బంధం చేయడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే కనీస హక్కును కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డాయి. మరోవైపు, హెచ్‌ఐసీసీ సదస్సు ప్రాంగణంతో పాటు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టారు.

About The Author