కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 25 నుంచి ‘నషా ముక్త్ భారత్ యాత్ర’

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో మొదటి విడత ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ (హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్) జరగనుంది. ఈ యాత్ర సన్నాహక చర్యల్లో భాగంగా శనివారం మేధావులతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. 
 
కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సదస్సులో  మాదకద్రవ్యాల (డ్రగ్స్) బారిన పడి యువత తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ కళాకారులు ప్రదర్శించిన లఘు నాటిక (స్కిట్) అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తామని సభకు హాజరైన వారందరూ ప్రతిజ్ఞ చేశారు.

సభ్యులు డా. కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, మేజర్ జనరల్ వి.ఆర్. మహేంద్ర (రిటైర్డ్, డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, జేఎన్టీయూ ప్రతినిధి కిషన్ కుమార్ రెడ్డి , ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సుధాకర్ సహా పలువురు మేధావులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక వేత్తలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ నెల 25వ తేదీ ఉదయం 8 గంటలకు అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్‌లో ప్రారంభమై, అంబర్‌పేట మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని యాత్ర ముందుకు సాగుతుంది. మొదటి రోజు 6 నంబర్ చౌరస్తా, ఫీవర్ హాస్పిటల్ ఎక్స్ రోడ్, హిందీ మహావిద్యాలయ, ఆర్ట్స్ కాలేజ్, సీతాఫల్‌మండి మీదుగా ముషీరాబాద్ చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు.

రెండో రోజు (26వ తేదీ) ఉదయం 8 గంటలకు ముషీరాబాద్ నుంచి బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, హిమాయత్ నగర్ చౌరస్తా, లిబర్టీ, జీహెచ్ఎంసీ కార్యాలయం, సచివాలయం, టెలిఫోన్ భవన్, ఖైరతాబాద్ చౌరస్తా, ఈనాడు కార్యాలయం, నిమ్స్ హాస్పిటల్ ఎదురుగా, పంజాగుట్ట చౌరస్తా, అమీర్‌పేట చౌరస్తా మీదుగా సత్యం థియేటర్ ప్రాంతానికి చేరుకుని అక్కడ బస చేస్తారు.

మూడో రోజు (27వ తేదీ) ఉదయం అక్కడి నుంచి బయలుదేరి యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, తారకరామ క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా ఫిలింనగర్ చేరుకుని, రాత్రి ఫిలింనగర్‌లో జరిగే బహిరంగ సభతో మొదటి విడత పాదయాత్ర ముగుస్తుంది. ఈ మొదటి విడత పాదయాత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మినహా నగరంలోని మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్లు కవర్ అవుతాయి. 

  

About The Author