`భారత్ సమ్మిట్’ పెరిగే దేశ వ్యతిరేక శక్తుల భేటీ

తెలంగాణలో ప్రజలు తాగే నీళ్లు లేక అల్లాడుతుంటే, రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే ఆదుకునే దిక్కు లేదు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ‘భారత్ సమ్మిట్’ పేరిట దేశ వ్యతిరేక శక్తులను, ప్రజాస్వామ్యం లేని రాచరిక దేశాల ప్రతినిధులను హైదరాబాద్ గడ్డ మీదకు పిలుచుకొస్తున్నారని మల్కాజ్‌గిరి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అల్లర్లు సృష్టించి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి అస్థిరపరిచే కుట్రలు చేసే జార్జ్ సోరోస్ సంస్థ ‘ఓపెన్ సొసైటీ ఫౌండేషన్’ మనుషులు, ‘ప్రోగ్రెసివ్ అలయన్స్’ ప్రతినిధులు, భారతదేశాన్ని ఫాసిస్ట్ కంట్రీ అని అవమానించే సునీతా విశ్వనాథ్ లాంటి వాళ్లు రాహుల్ గాంధీకి దోస్తులై ఇవాళ హైదరాబాద్ సమ్మిట్‌లో పాల్గొంటున్నారని ఆయన మండిపడ్డారు. 
 
కనీసం ఎన్నికలు కూడా జరగని, మానవ హక్కుల ఉల్లంఘన జరిగే 42 ఇస్లామిక్ రాచరిక దేశాలు నీకు ఆదర్శమయ్యాయా అని రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. వందల ఏళ్ల పాటు తురుష్కులు, బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, 18 ఏళ్ల ఖుదీరాం బోస్ లాంటి లక్షలాది మంది ప్రాణత్యాగాలతో, అండమాన్ జైళ్లలో మగ్గిన పోరాటాలతో సాధించుకున్న భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై అపహాస్యం చేస్తున్నారని ఈటల రాజేందర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ, ప్రతిపక్ష నేత హోదాలో ఉండి సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, పార్లమెంటరీ వ్యవస్థలతో పాటు, సియాచిన్ మంచు కొండల్లో మైనస్ డిగ్రీల చలిలో తుపాకీ ట్రిగ్గర్లపై వేళ్లు పెట్టి దేశాన్ని కాపాడే సైనికులను కూడా కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నాడు ప్రధాని పి.వి. నరసింహారావు స్వయంగా అటల్ బిహారీ వాజ్‌పేయిని ఐక్యరాజ్యసమితికి పంపితే భారత ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టారని  చేశారు.
 
బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరా గాంధీని నియంత అని విమర్శించినప్పటికీ దేశ గెలుపును వాజ్‌పేయి పార్లమెంట్‌లో కీర్తించారని గుర్తుచేశారు. నేడు ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు ఎంపీల కమిటీలను పంపి దేశ ప్రతిష్ఠను పెంచుతుంటే, రాహుల్ గాంధీ మాత్రం విదేశాల్లో దేశ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ఐదేళ్లు కూడా అవినీతి లేని నీతివంతమైన పాలన అందించలేదని రాజేందర్ విమర్శించారు. 
 
నెహ్రూ కాలం నాటి ఆర్మీ జీపుల కొనుగోలు అక్రమాల నుంచి రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణం, మన్మోహన్ సింగ్ పాలనలో 2జీ స్కామ్, కోల్ స్కామ్ వరకు కుంభకోణాలేనని, సొంత క్యాబినెట్ మంత్రులనే జైళ్లకు పంపిన చరిత్ర కాంగ్రెస్‌దని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, నాటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల వల్ల పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలో రక్తపాతం సృష్టించారని గుర్తుచేశారు. 
 
2014లో మోదీ గారు ప్రధాని అయ్యాక ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని, 12-13 ఏళ్ల పాలనలో ఒక్క స్కామ్ కూడా లేదని, ప్రపంచంలో 14వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 4వ స్థానానికి చేర్చారని తెలిపారు. రూ.12 లక్షల కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, 156 ఎయిర్‌పోర్టులతో “నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా” చూపించారన్నారు.
తెలంగాణలో 30 శాతం కమిషన్ లేనిదే ఏ పనీ జరగడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, చిన్న బిల్లులకు 10-15 శాతం కమిషన్లు వసూలు చేస్తున్నారని ఈటల ఆరోపించారు. వరంగల్ రైతు, కామారెడ్డి బీసీ, చేవెళ్ల ఎస్సీ-ఎస్టీ, యువ, మహిళా డిక్లరేషన్లను తుంగలో తొక్కారని మండిపడ్డారు. 2023 ఎన్నికలకు 6 నెలల ముందే తొలి ఆర్థిక మంత్రిగా తాను ఈ హామీలతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుందని హెచ్చరిస్తే “ఈటలకే తెలివుందా, మాకు తెలవదా?” అని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. 
 
హైదరాబాద్‌లో 10 శాతం భూములు వేలం వేసి, 90 శాతం భూములపై ఇల్లీగల్ దందా చేస్తూ వేల కోట్ల డబ్బు సంచులను ఢిల్లీలో రాహుల్ గాంధీకి మోసుకెళ్తున్నారని, అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, కనీసం 9 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని, బ్యాంకులకు పోతే చెప్పులు దాచుకుంటున్నారని ముఖ్యమంత్రే రాష్ట్ర పరువు తీస్తున్నారని విమర్శించారు. 

About The Author