ప్రపంచ ఏఐ చిప్ దిగ్గజం ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ తన సీఈఓ పదవికి రాజీనామా చేయడంతో టెక్ ప్రపంచంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సంస్థను అగ్రస్థానంలో నిలిపిన ఆయన స్థానాన్ని భర్తీ చేసే తదుపరి సారథి ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎన్విడియా ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జెన్సన్ హువాంగ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత సంతతికి చెందిన ముగ్గురు టెక్నాలజీ దిగ్గజాలు సంజయ్ మెహ్రోత్రా, నికేష్ అరోరా, థామస్ కురియన్ సంభావ్య పోటీదారులుగా తెరపైకి వచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చర్చనీయాంశమైన పేర్లలో మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ, పాలో ఆల్టో నెట్వర్క్స్ అధిపతి, గూగుల్ క్లౌడ్ అధిపతి కూడా ఉన్నారని సమాచారం.
కొత్త సీఈఓ ఎంపిక కోసం ఎన్విడియా బోర్డు ఇప్పటికే ఒక ప్రత్యేక నియామక సంస్థ సాయం తీసుకుంటుంది. పూర్తిస్థాయి సీఈఓను నియమించే వరకు ప్రస్తుత సీఎఫ్ఓ కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
సెమీకండక్టర్ రంగంలో అపార అనుభవం ఉన్న సంజయ్ మెహ్రోత్రా ప్రస్తుతం ప్రముఖ మెమరీ చిప్ తయారీ సంస్థ ‘మైక్రాన్ టెక్నాలజీ’కి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో మెమరీ చిప్‌లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, ఆయన నాయకత్వంలో మైక్రాన్ షేర్ల విలువ భారీగా పుంజుకుంది. చిప్ తయారీ రంగంపై ఉన్న లోతైన పట్టు ఆయనకు ప్రధాన బలంగా మారింది.
2018 నుంచి సైబర్ సెక్యూరిటీ దిగ్గజం ‘పాలో ఆల్టో నెట్వర్క్స్’ సీఈఓగా నికేష్ అరోరా పనిచేస్తున్నారు. ఆయన సారథ్యంలో కంపెనీ ఏఐ ఆధారిత సైబర్ సెక్యూరిటీ సేవలను విస్తరించి మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. గతంలో సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా , అంతకుముందు గూగుల్‌లో దాదాపు పదేళ్ల పాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయన సొంతం.
ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ సీఈఓగా ఉన్న థామస్ కురియన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్ప్రైజ్ ఏఐ సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ టెక్నాలజీ సంస్థలను సమర్థవంతంగా నడిపించడంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా కార్పొరేట్ సంస్థలతో వ్యాపార సంబంధాలు నెరపడంలో ఆయనకు తిరుగులేని అనుభవం ఉంది.
భారత సంతతి అధినేతలతో పాటు ఎన్విడియా అంతర్గత వర్గాల నుంచి తాత్కాలిక సీఈఓ కోలెట్ క్రెస్, అలాగే ఏఐ కంప్యూటింగ్‌లో కీలకమైన ‘కూడా’ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ ఇయాన్ బక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

More Stories
ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ రాజీనామా
ఆర్బీఐ గరిష్ట పరిమితి దాటిన ధరల పెరుగుదల
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.80 లక్షల ల్యాప్‌టాప్‌లు