కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.80 లక్షల ల్యాప్‌టాప్‌లు

విధి నిర్వహణ కోసం ప్రభుత్వం అందించే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల‌ను నాలుగేళ్ల తర్వాత తమ వద్దే ఉంచుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఈ పరికరాల కొనుగోలు ధర పరిమితిని కూడా భారీగా పెంచింది. అర్హులైన అధికారులకు రూ.1.50 లక్షల వరకు విలువైన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు కొనుగోలు చేయవచ్చు. 40 శాతానికి మించిన మేక్‌ ఇన్‌ ఇండియా (భారత్‌లో తయారీ) భాగస్వామ్యం ఉన్న పరికరాలకైతే ఈ పరిమితి రూ.1.80 లక్షల వరకు ఉంటుంది. 
 
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం  కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 2023 జూలైలో జారీ చేసిన పాత నిబంధనలను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విధుల నిర్వహణ కోసం ఉద్యోగులకు కేటాయించే ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు తదితర పరికరాలు కొనుగోలు చేసిన తేదీ నుంచి నాలుగేళ్ల పాటు ప్రభుత్వ ఆస్తిగానే ఉంటాయి. నాలుగేళ్ల వినియోగం పూర్తయిన తర్వాత సంబంధిత అధికారి వాటిని తన వద్దే ఉంచుకోవచ్చు. 
సెక్షన్ ఆఫీసర్ హోదా లేదా అంతకంటే పై స్థాయి హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పరికరాలను పొందేందుకు అర్హులు. “అధికారిక విధులను నిర్వహించేందుకు వీలుగా, అర్హులైన అధికారులకు ల్యాప్‌టాప్, టాబ్లెట్, నోట్‌ప్యాడ్, అల్ట్రా-బుక్, నోట్‌బుక్ లేదా ఇటువంటి ఇతర పరికరాలను అందించాలని నిర్ణయించడం జరిగింది” అని అందులో పేర్కొన్నారు.
 
ఇందుకోసం ఉద్యోగి ఎలాంటి అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఆ పరికరంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సమాచారం, అధికారిక డేటాను పూర్తిగా తొలగించిన తర్వాతే ఉద్యోగికి అప్పగించాలి. సమాచార భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిబంధనను తీసుకొచ్చారు.
నాలుగేళ్ల వినియోగ కాలం పూర్తికాకముందే ఉద్యోగి పదవీ విరమణ చేసినా, ఇతర కారణాలతో ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలిగినా పరికరాన్ని తిరిగి ఇవ్వ‌న‌క్క‌ర్లేదు.
దాని తరుగుదల విలువ (బుక్‌ వాల్యూ)కు సమానమైన మొత్తాన్ని చెల్లించి తన వద్దే ఉంచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని మరో మంత్రిత్వ శాఖ లేదా విభాగానికి బదిలీ అయినా, డిప్యూటేషన్‌పై అనుబంధ లేదా ఉప కార్యాలయాలకు వెళ్లినా ఉద్యోగి తనకు కేటాయించిన పరికరాన్ని వెంట తీసుకెళ్లవచ్చు. రక్షణ శాఖ, సాయుధ దళాలు, పారామిలటరీ బలగాలు, సున్నితమైన సమాచారంతో వ్యవహరించే సంస్థల విషయంలో ఆయా శాఖలు విధించే సమాచార భద్రతా పరిమితులు వర్తిస్తాయి.

About The Author