ఆర్బీఐ గరిష్ట పరిమితి దాటిన ధరల పెరుగుదల

గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం, 2024ని ప్రాతిపదిక సంవత్సరంగా  తీసుకున్న వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారంగా, అక్టోబర్ 2026లో భారతదేశపు రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి పెరిగింది.  దీంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన 2 నుంచి 6 శాతం గరిష్ఠ పరిమితిని దాటింది. రెండేళ్ల తర్వాత ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడం గమనార్హం. 
 
ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడం, ఇతర వస్తువులు, సేవల వ్యయాలు అధికమవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.94 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ 2026లో వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 5.54 శాతంగా ఉంది. అక్టోబర్ నెలలో, పట్టణ ప్రాంతాల్లోని 5.41 శాతంతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.63 శాతంగా నమోదైంది. 
 
వినియోగదారుల ఆహార ధరల సూచీ (సిఎఫ్ పిఐ) ద్వారా కొలిచే ఆహార ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌లోని 7.74 శాతం నుండి అక్టోబర్‌లో 8.94 శాతానికి పెరిగింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 9.09 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 8.68 శాతంగా ఉంది. గణాంకాల ప్రకారం, మొత్తం వినియోగదారుల ధరల సూచీ సెప్టెంబర్‌లోని 109.49 నుండి అక్టోబర్‌లో 110.05కి పెరిగింది.  గ్రామీణ సిపిఐ110.11 నుండి 110.73కి, పట్టణ సిపిఐ 108.71 నుండి 109.22కి పెరిగాయి. 
 
ఉల్లి ధరల్లో అత్యధిక ద్రవ్యోల్బణం
 
విడి వస్తువులను పరిశీలిస్తే, అక్టోబర్ నెలలో ఉల్లి ధరల్లో అత్యధికంగా 116.22 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది (సెప్టెంబర్‌లో ఇది 108.13 శాతంగా ఉంది). వెల్లుల్లి ధరలు 60.74 శాతం పెరగగా, వెండి ఆభరణాల ధరల్లో 52.39 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. అల్లం, నిమ్మకాయల ధరల్లో వరుసగా 48.32 శాతం, 47.30 శాతం ద్రవ్యోల్బణం కనిపించింది. మరోవైపు, బంగాళదుంపల ధరలు ఏడాది ప్రాతిపదికన 14.24 శాతం తగ్గాయి.  వీటి తర్వాత కాలీఫ్లవర్ ధరలు 10.57 శాతం, కొబ్బరికాయ ధరలు 5.60 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. వంకాయ, క్యాబేజీ ధరలు వరుసగా 3.34 శాతం, 1.92 శాతం తగ్గాయి. 
 
రెస్టారెంట్లు, వ్యక్తిగత సంరక్షణ రంగాలలో రెండంకెల ద్రవ్యోల్బణం
 
ప్రధాన వ్యయ విభాగాలలో, అక్టోబర్‌లో రెస్టారెంట్లు, వసతి సేవలలో 10.06 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా, వ్యక్తిగత సంరక్షణ, సామాజిక భద్రత, ఇతర వస్తువులు, సేవలలో 10.14 శాతం నమోదైంది. ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం 8.51 శాతంగా ఉండగా, రవాణా రంగంలో 5.84 శాతం నమోదైంది. దుస్తులు, పాదరక్షల ద్రవ్యోల్బణం 4.96 శాతంగా, గృహవసతి, నీరు, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాలలో 2.90 శాతంగా నమోదైంది. ఆరోగ్య సంబంధిత ద్రవ్యోల్బణం 2.05 శాతంతో సాపేక్షంగా మితంగా ఉండగా, విద్యా సేవలలో 4.02 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.

About The Author