కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని నిర్ధారిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తమ ప్లాట్లను తొలగించాలన్న భూ యజమానుల విజ్ఞప్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించారు. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా జైలు శిక్ష అమలును నాలుగు వారాలపాటు నిలిపివేశారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజల్ గ్రామంలోని మన్నె ముత్యాలమ్మ కుంట ప్రాంతంలో సర్వే నంబర్లు 536, 537, 657, 658లోని ప్లాట్లకు సంబంధించి వివాదం ఏర్పడింది. పిటిషనర్లు ప్లాట్ నంబర్ 59, ప్లాట్ నంబర్ 62 తూర్పు భాగాన్ని రిజిస్ట్రేషన్ ద్వారా పొందారు. ప్లాట్ నంబర్ 62 మొత్తం 1,067 చదరపు గజాలు కాగా, తూర్పు, పడమర భాగాలుగా విభజించడంతో ఒక్కో భాగం 533.5 చదరపు గజాలుగా ఉంది. తమ ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని 2024 మార్చి 14న అధికారులకు దరఖాస్తు చేశారు. స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.
ఆగస్టు 5న విచారణ జరిపిన హైకోర్టు 2022 ఆగస్టు 27న కలెక్టర్, అదే ఏడాది సెప్టెంబర్ 2న జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా పిటిషనర్ల అభ్యర్థనలను పరిశీలించాలని ఆదేశించింది. తిరస్కరిస్తే కారణాలను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, వాటి ప్రతులను పిటిషనర్లకు అందించాలని, ఈ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 11న ఉత్తర్వుల ప్రతిని కలెక్టర్‌కు అందించినప్పటికీ, అక్టోబర్ 10తో గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
నోటీసులు అందిన తర్వాత 2026 ఫిబ్రవరి 26న, తిరిగి హైకోర్టు పునఃపరిశీలించాలని ఆదేశించిన అనంతరం జూలై 8న కలెక్టర్ అభ్యర్థనలను తిరస్కరించారు. అదే లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 62 పడమర భాగంతోపాటు మరో రెండు ప్లాట్లను 2022లోనే నిషేధిత జాబితా నుంచి తొలగించిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. గతంలో ఇదే లేఅవుట్‌కు సంబంధించి మరో భూయజమాని పిటిషన్‌పై ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారని పేర్కొంది. ఒకే లేఅవుట్లోని ఇతర ప్లాట్లకు అనుమతిస్తూ పిటిషనర్ల విషయంలో భిన్నంగా వ్యవహరించడానికి కారణాలు చూపలేదని అభిప్రాయపడింది.
సర్వే నంబర్ 537ను తొలగించి, మిగిలిన 536, 657, 658లను నిషేధిత జాబితాలో కొనసాగించడంపై కూడా సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొంది. భూ సంస్కరణల చట్టం ప్రకారం భూముల పునరప్పగింత ప్రక్రియ పూర్తికాలేదని, రెవెన్యూ అధికారులు నిబంధనలు పాటించలేదని కలెక్టర్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే గత ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని భావిస్తే అప్పీల్ వంటి చట్టబద్ధ మార్గాలను ఆశ్రయించాలే తప్ప, వాటిని అమలు చేయకుండా ఉండరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
కోర్టు ధిక్కరణ విచారణలో గత ఉత్తర్వుల అమలు జరిగిందా లేదా అన్నదే పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే చర్యలు తీసుకోవడం, పక్క ప్లాట్ల విషయంలో గత నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం ఉద్దేశపూర్వక ధిక్కరణ కిందకు వస్తుందని నిర్ధారించింది. కోర్టు ధిక్కరణ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం శిక్ష విధిస్తూ, నాలుగు వారాల్లో జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

More Stories
కుటుంబ తప్పిదాలను సమర్ధించుకొనే ప్రయత్నమే సోనియా గ్రంధం!
ఢాకా మురికివాడలను ఢిల్లీగా చిత్రీకరిస్తున్న చైనా వ్లాగర్లు
చైనాను వేధిస్తున్న రుణ భారం