శ్రీ మాతా అమృతానందమయి దేవి హైదరాబాద్‌కు రాక

* 10, 11 తేదీల్లో బ్రహ్మస్థానం రజతోత్సవ వేడుకలు

శ్రీ మాతా అమృతానందమయి దేవి (అమ్మ) రెండు రోజుల పాటు జరగనున్న 25వ వార్షిక బ్రహ్మస్థానం ఆలయ మహోత్సవాలకు నాయకత్వం వహించేందుకు హైదరాబాద్‌లోని భాగ్యనగర్ మాతా అమృతానందమయి మఠానికి చేరుకున్నారు. ఈ ఉత్సవాలు నవంబర్ 10, 11 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మకు భక్తులు ప్రార్థనలు, వేదమంత్రోచ్ఛారణలు, సంప్రదాయ మంగళ వాద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఘనస్వాగతం పలికారు. 

 
హైదరాబాద్ మఠం అధిపతి స్వామిని సువిద్యామృత ప్రాణ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో అమ్మకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. బెంగళూరులో బ్రహ్మస్థానం మహోత్సవాలను విజయవంతంగా ముగించుకున్న అనంతరం అమ్మ సీనియర్ సన్యాస శిష్యులు, బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు, ఆశ్రమవాసులతో కలిసి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

రెండు రోజుల ఉత్సవాలు మంగళవారం ప్రారంభమవుతున్నాయి. ఉదయం సుమారు 11 గంటలకు అమ్మ ప్రధాన వేదికపైకి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు పుష్పమాలలతో అమ్మకు స్వాగతం పలుకుతారు. అనంతరం అమ్మ ఆధ్వర్యంలో ధ్యానం, సత్సంగం, భక్తి భజనలు నిర్వహిస్తారు. తదుపరి భక్తులకు అమ్మ దర్శనం కల్పిస్తారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మాతా అమృతానందమయి మఠం విస్తృత ఏర్పాట్లు చేసింది. 

 
బ్రహ్మస్థానం ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర రజతోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందనున్నారని మఠం నిర్వాహకులు తెలిపారు.

 

About The Author