ధరణి పోర్టల్‌ అక్రమాల వెనుక భారీ నెట్‌వర్క్‌

తెలంగాణలో భూముల రికార్డుల నిర్వహణ కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాల వెనుక భారీ నెట్‌వర్క్‌ ఉన్నట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో వెల్లడవుతోంది. మండల కేంద్రాల్లోని ఎంపిక చేసిన మీ సేవ కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని చార్మినార్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ కార్యాలయం వరకు ఈ నెట్‌వర్క్‌ విస్తరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ధరణి, భూ భారతి భూ రికార్డుల అక్రమాల వ్యవహారంలో సీఐడీ ఇప్పటివరకు తొమ్మిది మందిని అధికారికంగా అరెస్టు చేసినట్లు వెల్లడైంది. సంగారెడ్డిలోని ఆర్‌సీ పురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి తొలుత నలుగురిని అరెస్టు చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సోదాల తర్వాత మరో ఐదుగురిని అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ధరణి దరఖాస్తులను సేకరించి, వాటిని చార్మినార్‌ కార్యాలయానికి పంపినట్లు గుర్తించారు. అక్కడి నుంచి నేరుగా లాగిన్‌ యాక్సెస్‌ను దుర్వినియోగం చేసి భూ యజమానుల పేర్లు మార్చడం, వివాదాల్లో ఉన్న భూములను నమోదు చేయడం, తహసీల్దార్ల ప్రమేయం లేకుండానే భూ వినియోగ మార్పిడి ప్రక్రియలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

డిజిటల్‌ ఫోరెన్సిక్‌ లాగ్‌ల పరిశీలనలో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10 గంటల మధ్య భూముల రికార్డుల్లో మార్పులు జరిగినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. సాధారణ కార్యాలయ వేళలు ముగిసిన తర్వాత అధికారుల దృష్టికి రాకుండా ఉండేందుకే ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు అనుమానిస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసిన సిట్‌ సీఐడీ డీజీ చారు సిన్హా పర్యవేక్షణలో 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 

ధరణి పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ టెర్రాసిస్‌ టెక్నాలజీస్‌ సంస్థ కార్యాలయంలోనూ సిట్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మాదాపూర్‌లోని జయభేరి సిలికాన్‌ టవర్స్‌లో ఉన్న కార్యాలయంలో పోర్టల్‌ సాఫ్ట్‌వేర్‌ నిర్మాణం, వివిధ మాడ్యూళ్ల అభివృద్ధి, వినియోగదారుల లాగ్‌లు, డేటాబేస్‌ పర్యవేక్షణకు సంబంధించిన అనుమతులను పరిశీలించాయి.

భూముల రికార్డులను మార్చగలిగే అడ్మినిస్ట్రేటర్‌, మాస్టర్‌ లాగిన్ల నియంత్రణ ఎవరికి ఉండేది? ప్రైవేట్‌ వ్యక్తులకు ఆ డేటాపై నియంత్రణ ఎలా లభించింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నాయి. ఐటీ నిపుణుల సహకారంతో యాక్సెస్‌ అనుమతులు, ప్రైవేట్‌ వ్యక్తుల పాత్రను విశ్లేషిస్తున్నాయి. ధరణి పోర్టల్‌ నిర్వహణ కోసం 2018లో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీజీటీఎస్‌) నిర్వహించిన టెండర్‌ ప్రక్రియ వివరాలను కూడా సేకరించాయి.

అక్టోబర్‌ 2020 నుంచి డిసెంబర్‌ 2024 వరకు నమోదైన దాదాపు ఎనిమిది లక్షల లావాదేవీల్లో సుమారు 22 వేల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో గుర్తించినట్లు సమాచారం.  

About The Author