తెలంగాణాలో జనవరి 15 నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్, 25 నుంచి జనగణన

తెలంగాణలో రెండో దశ జనగణన-2027 నిర్వహణకు తేదీలు ఖరారు చేశారు. రాష్ట్రంలో రెండో విడతలో భాగంగా జనాభా లెక్కల సేకరణను వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్‌ నంబర్‌ 155ను జారీ చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ కార్యాలయం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తెలంగాణ గెజిట్‌లో ప్రభుత్వం పునఃప్రచురించింది. 
 
జనగణనలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాలను సేకరించనున్నారు. ఇందుకు ముందు ప్రజలకు స్వీయ జనగణన (సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌) చేసుకునే అవకాశం కల్పించారు. జనవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఈ సమయంలో ప్రజలు యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా తమ కుటుంబానికి సంబంధించిన వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత జనవరి 25వ తేదీ నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుంది. 
 
జనగణన ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ జనగణనకు అవకాశం కల్పించింది. జనవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రజలు ఆన్‌లైన్‌ విధానంలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చే యాప్‌, వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా కుటుంబ సభ్యులు తమ వివరాలను తామే నమోదు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. 
 
సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ గడువు ముగిసిన తర్వాత జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జనగణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జనాభా వివరాలను సేకరిస్తారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్న కుటుంబాల వివరాలను కూడా జనగణన ప్రక్రియలో భాగంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. జనాభా లెక్కల సేకరణ పూర్తి అయిన తర్వాత వివరాల పరిశీలన, అవసరమైన సవరణల కోసం రివిజనల్‌ రౌండ్‌ నిర్వహించనున్నారు. 
 
2027 మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జనగణనకు సంబంధించి మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటలను ప్రామాణిక తేదీగా (రెఫరెన్స్‌ డేట్‌) నిర్ణయించారు. అంటే జనాభా వివరాలను లెక్కించేటప్పుడు ఈ తేదీని ప్రాతిపదికగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 30వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నవంబర్‌ 9వ తేదీన జీఓ జారీ చేసింది. 
జనగణన-2027లో భాగంగా తెలంగాణలో తొలి విడతలో ఇళ్ల జాబితా తయారీ, గృహ గణన ప్రక్రియను మే 11వ తేదీ నుంచి జూన్‌ 9వ తేదీ వరకు నిర్వహించారు. ఇప్పుడు రెండో విడతలో జనాభా లెక్కల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

About The Author