హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఐసిఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)లో దాదాపు 38 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి, సైంటిస్ట్ ‘జి’ (డైరెక్టర్ గ్రేడ్) స్థాయికి ఎదిగిన గొప్ప శాస్త్రవేత్త శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. సోషల్ కాజ్, మానస ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ డిసేబిలిటీ స్టడీస్ లకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
ప్రీ-క్లినికల్ టాక్సికాలజీ, ఔషధ పరిశోధనలు, వ్యాక్సిన్ల భద్రత, బయోటెక్నాలజీ రంగాల్లో విశేష పరిశోధనలు చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రీకాంబినెంట్లు, ఆర్-డిఎన్ఎ యాంటీ రాబిస్ ప్రీ క్లినికల్ భద్రతా మూల్యాంకనంపై దేశంలో మొట్టమొదటిసారిగా ఒక సవాలుతో కూడిన పరిశోధనను చేపట్టారు.
ప్రీక్లినికల్ టాక్సికాలజీ, పోషకాహార-కాలుష్య పరస్పర చర్య, సామాజిక ఔషధ మహమ్మారి శాస్త్ర రంగాలకు ఆయన చేసిన సేవలకు జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పరిశోధనలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పిపిపి) నమూనాను విజయవంతంగా అమలు చేయడంల, నియంత్రణ మార్గదర్శకాలను బలోపేతం చేయడంలో ఆయన సాధించిన విజయాలు ప్రశంసనీయమైనవి. ఆయన అంటువ్యాధుల వ్యాప్తిలో ప్రధాన పరిశోధకులలో ఒకరిగా, ఐసిఎంఆర్-ఎన్ఐఎన్ కరోనా కార్యకలాపాలలో ముందు వరుస యోధుడిగా కూడా చురుకుగా పాల్గొన్నారు. ఆయన నార్మన్ బోర్లాగ్ ఫెలోషిప్–యుఎస్ డీఏ గ్రహీత.
పోషకాహారం, పర్యావరణ కాలుష్యం, ముఖ్యంగా లెడ్ (సీసం) విషప్రభావాల నివారణపై ఆయన చేసిన కృషి ప్రజారోగ్య రంగానికి ఎంతో విలువైనది. సుమారు 80 శాస్త్రీయ పరిశోధనా ప్రచురణలు, 70 నియంత్రణ సంబంధిత పరిశోధనా నివేదికలు అందించడంతో పాటు 17 మంది పరిశోధకులకు డాక్టరేట్ మార్గదర్శకత్వం వహించారు.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ)లో కీలకమైన శాస్త్రీయ ప్యానెల్ చైర్మన్‌గా, పలు జాతీయ స్థాయి శాస్త్రీయ కమిటీల్లో నిపుణుడిగా సేవలందించారు. తెలంగాణ పర్యావరణ ప్రభావ అంచనా సంస్థలో నిపుణుల సభ్యుడిగా కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ ఫార్మకాలాజికల్ సొసైటీ జాతీయ అధ్యక్షుడిగా, న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియాలో వివిధ బాధ్యతల్లో పనిచేసి శాస్త్రీయ సంస్థల అభివృద్ధికి తోడ్పడ్డారు.
ఆర్ఎస్ఎస్ పరివార్‌కు చెందిన వివిధ క్షేత్రాల్లోనూ అనేక బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక, సైద్ధాంతిక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ప్రజ్ఞాభారతి సంస్థ స్థాపన, అభివృద్ధి, విస్తరణలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. శాస్త్రవేత్తగా, పరిశోధకుడిగా, సంస్థాగత కార్యకర్తగా, సమాజహితాన్ని ఆకాంక్షించిన వ్యక్తిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.

More Stories
వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణల దుమారం
తెలంగాణకు అదనంగా 769 వైద్య విద్య పీజీ సీట్లు
మంత్రి, ఎమ్యెల్యే మధ్య సయోధ్యకు ఫలించని పిసిసి అధినేత యత్నం!