తెలంగాణకు అదనంగా 769 వైద్య విద్య పీజీ సీట్లు 

తెలంగాణాలో 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో వైద్యవిద్య పీజీ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి కొత్తగా 769 సీట్లను వైద్య విద్య నియంత్రణ సంస్థ మంజూరు చేసింది. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్ఎంసి) పరిధిలోని మెడికల్‌ అసెస్మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు (ఎం ఎ ఆర్ బి) శుక్రవారం దేశవ్యాప్తంగా పెంచిన వైద్య పీజీ సీట్ల వివరాలను వెల్లడించింది. 
 
ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వైద్య పీజీ విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.  ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే ఏకంగా 300 పీజీ సీట్లు పెరిగాయి. వాస్తవానికి మరో 400 సీట్లు పెంచాలని వైద్యవిద్య సంచాలకుల విభాగం ఎన్‌ఎంసీకి ప్రతిపాదనలు పంపింది. అయితే పరిశీలన అనంతరం 300 సీట్ల పెంపునకు అనుమతి లభించింది. 
 
దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి పెరిగి మొత్తం 1,766కు చేరనుంది. మరోవైపు ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ 469 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడ మొత్తం పీజీ సీట్ల సంఖ్య 2,419కు చేరింది.  మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి ఈ విద్యా సంవత్సరంలో 4,185 పీజీ సీట్లతో తెలంగాణ వైద్య విద్యారంగంలో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

ఈసారి భూపాలపల్లి, జగిత్యాల తదితర ప్రాంతాల్లోని వైద్య కళాశాలల్లోనూ పీజీ సీట్లు అందుబాటులోకి రానుండటం విశేషం. దీంతో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ వైద్య పీజీ విద్యను అభ్యసించే అవకాశం విద్యార్థులకు లభించనుంది. 
ఇప్పటికే పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం త్వరలో అర్హులైన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను ప్రకటించనుంది. 
 
ఏ కళాశాలలో ఏ విభాగానికి ఎన్ని సీట్లు కేటాయించారనే వివరాలపై మరో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని వర్సిటీ ఉపకులపతి ఆచార్య రమేశ్‌రెడ్డి వెల్లడించారు. సీట్ల పెంపుతో ప్రవేశాల ప్రక్రియలోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో సుమారు 175 వరకు యూజీ (ఎంబిబిఎస్) సీట్లు ఇంకా మిగిలి ఉండటం గమనార్హం.
 
వీటిని భర్తీ చేసేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 16వ తేదీ వరకు స్పెషల్‌ స్ట్రే వేకెన్సీ రౌండ్‌ నిర్వహించి మిగిలిన సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. పీజీ సీట్ల పెంపుతో ఒకవైపు వైద్య విద్యలో ఉన్నత చదువులకు అవకాశాలు విస్తరిస్తుండగా, మరోవైపు ఖాళీగా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి కూడా వర్సిటీ ప్రయత్నాలు చేస్తోంది.

 

About The Author