యుపిలో ప్రకృతి వైపరీత్యాల్లో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం రెట్టింపు

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు, కుటుంబాలకు విపత్తు సహాయక నిబంధనల కింద ఆర్థిక సహాయాన్ని గణనీయంగా పెంచింది. సవరించిన నిబంధనల ప్రకారం, ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ. 4 లక్షల నుండి రూ. 8 లక్షలకు పెంచారు.  పంట నష్టానికి ఇచ్చే పరిహారాన్ని 25 నుండి 30 శాతం వరకు పెంచడంతో పాటు, పశువులు, కోళ్లు, వ్యవసాయ భూమి, ఇతర ఆస్తుల నష్టానికి అందించే సహాయాన్ని కూడా ప్రభుత్వం మెరుగుపరిచింది.
 
రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా రైతులు ఈ సవరించిన సహాయక నిబంధనల ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ కొత్త పరిహార నిబంధనలు ఏప్రిల్ 1 నుండి నవంబర్ 4, 2026 మధ్య జరిగిన నష్టాలకు వర్తిస్తాయి.  ఈ సవరించిన సహాయాన్ని ‘స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్’ (ఎస్డీఆర్ఎఫ్), ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్’ (ఎన్డిఆర్ఎఫ్) నిధుల ద్వారా అందిస్తారు. అలాగే, పశువుల మరణాలకు ఇచ్చే పరిహార రేట్లను కూడా ప్రభుత్వం సవరించి, రైతులకు,  పశుపోషకులకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించనుంది. 
 
కొత్త నిబంధనల ప్రకారం, పెద్ద పశువులు (ఎద్దులు, గేదెలు వంటివి) మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ. 40,000 నుండి రూ. 50,000కు పెంచారు. మేకలు, గొర్రెలు మరియు పందుల వంటి చిన్న జంతువుల విషయంలో, సహాయాన్ని రూ. 4,000 నుండి రూ. 5,500కు పెంచారు. అదేవిధంగా, గుర్రాలు, ఖచ్చరాల (mules) వంటి బరువులు మోసే జంతువులు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ. 20,000 నుండి రూ. 25,400కు పెంచారు. కోళ్ల పెంపకందారులకు ఇకపై ఒక్కో కోడికి రూ. 100కు బదులుగా రూ. 130 చొప్పున పరిహారం అందుతుంది. 
 
హెక్టారుకు సవరించిన పరిహార రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి: నీటి పారుదల సౌకర్యం ఉన్న వ్యవసాయ భూమి: రూ. 17,000 నుండి రూ. 22,000కు పెంచారు. వర్షాధార వ్యవసాయ భూమి: రూ. 8,500 నుండి రూ. 11,000కు పెంచారు. బహువార్షిక పంటలు, వ్యవసాయ అటవీ పంటలు రూ. 22,500 నుండి రూ. 30,000కు పెంచారు. పట్టు పరిశ్రమలో కలిగే నష్టాలకు సంబంధించి కూడా ప్రభుత్వం సహాయాన్ని పెంచింది. తద్వారా పట్టు ఉత్పత్తిలో నిమగ్నమైన రైతులకు అదనపు మద్దతు లభిస్తుంది. 
 
సహజ విపత్తుల వల్ల వ్యవసాయ భూములు దెబ్బతిన్న రైతులకు, సవరించిన నిబంధనల ప్రకారం మరింత ఆర్థిక సహాయం అందుతుంది. వ్యవసాయ భూముల్లో పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించేందుకు ఇచ్చే పరిహారాన్ని హెక్టారుకు రూ. 18,000 నుండి రూ. 23,000కు పెంచారు. అదేవిధంగా, కొండచరియలు విరిగిపడటం. హిమపాతాల వల్ల దెబ్బతిన్న భూములకు ఇచ్చే సహాయాన్ని హెక్టారుకు రూ. 47,000 నుండి రూ. 60,000కు పెంచారు. 
 
సహాయ శిబిరాల్లో  ఉంటున్న బాధితులకు గరిష్టంగా 30 రోజుల వరకు సహాయం అందుతుంది. కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు, గరిష్టంగా 90 రోజుల పాటు తాగునీటి సరఫరాకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేకాకుండా, దెబ్బతిన్న ఇళ్లు, పాఠశాలలు, రోడ్లు, ఆసుపత్రుల మరమ్మతులకు కూడా ఆర్థిక సహాయం అందించేలా నిబంధనలను విస్తరించారు; 
 
సవరించిన నిబంధనల ప్రకారం, సహజ విపత్తుల వల్ల ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన కుటుంబాలకు మైదాన ప్రాంతాల్లో రూ. 1.85 లక్షలు, కొండ ప్రాంతాల్లో రూ. 2.06 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. మైదాన ప్రాంతాల్లో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 93,000 పరిహారంగా నిర్ణయించారు. అలాగే, సహజ విపత్తుల వల్ల దెబ్బతిన్న విద్యా మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్నిప్రాథమిక పాఠశాలలకు రూ. 15.50 లక్షల వరకు మరమ్మతు సహాయం లభిస్తుంది. మాధ్యమిక పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల కోసం, సవరించిన సహాయ నిబంధన ప్రకారం రూ. 26 లక్షల వరకు కేటాయించారు. 
 
 

 

About The Author