స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని 6వ బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది రెండు లైఫ్ బోట్లలో సహాయక చర్యలకు ఉపక్రమించారు. ఒక బోటులో ఐదుగురు, మరో బోటులో ఆరుగురు మొత్తం 11మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఐదుగురు మత్స్యకారులను సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చారు.
వారి బోట్లు ఒడ్డుకు చేరుకునే సమయంలో వరద ప్రవాహానికి అదుపుతప్పి బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ్మిలేరు వాగువైపు కొట్టుకుపోయారు. సిబ్బంది ఆచూకీ కోసం తమ్మిలేరు వాగు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం కలెక్టర్ దివాకర్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో అజయ్‌కుమార్ సమన్వయం చేస్తున్నారు. లైఫ్ జాకెట్లు ఉండటంతో సురక్షితంగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, సిబ్బందిని రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ఆయన ప్రధాన కార్యదర్శి సంజయ్ జజును కూడా కోరారు. “ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని, సహాయక చర్యలలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించాను,” అని ఆయన తెలిపారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక పోస్ట్‌లో, గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉండే అవకాశం ఉన్న ప్రదేశాన్ని సహాయక బృందాలు గుర్తించాయని పేర్కొంటూ వారిని సురక్షితంగా రక్షిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిరాటంకంగా కురిసిన భారీ వర్షం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. అశ్వారావుపేట మండలంలో 28 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. వరదలో చిక్కుకున్న ఓ మహిళా రైతును ఎస్డీఆర్ఎఫ్ అధికారులు కాపాడారు.
పెద్దవాగు ప్రాజెక్టు రింగుబండ తాజా వర్షానికి మళ్లీ తెగింది. దొంతికుంట చెరువు పూర్తిస్థాయిలో నిండింది. చెరువు కట్టకు గండికొట్టి వరదను దిగువకు విడుదల చేయగా ఆయకట్టు పంటలన్నీ నీటమునిగాయి. అశ్వారావుపేట – ఊట్లపల్లి మార్గంలోని రాకపోకలు నిలిచిపోయాయి.

More Stories
సైబర్ నేరాల ముప్పు బాధితులకు ప్రత్యేక భీమా పాలసీలు
అశేష జనవాహిని మధ్య నిర్మల్ లో ‘బీజేపీ మహాపాదయాత్ర’
ఢిల్లీలో రచ్చకెక్కిన కాంగ్రెస్ నేతల అంతర్గత కుమ్ములాటలు!