అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని ‘పికాక్స్ మౌంటైన్’పై అణుదాడి దాడి చేసే అవకాశముందని ప్రకటించడంతో అంతర్జాతీయంగా తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అణుదాడి జరిగితే దాని రేడియేషన్ ప్రభావం భారత్ వరకు చేరుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అణుదాడి జరుగుతుందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. ట్రంప్ కూడా గతంలో అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఉన్న పికాక్స్ మౌంటైన్‌లో భూగర్భ అణు కేంద్రం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కేంద్రం భారీ పర్వతం కింద సుమారు 328 అడుగుల లోతులో ఉన్నట్లు అంచనా. ఇక్కడ ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియం నిల్వల్లో కొంత భాగాన్ని ఉంచినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి స్థాయి ఆధారాలు బహిరంగంగా అందుబాటులో లేవు.
గతంలో ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై దాడులు జరిగినప్పటికీ, పికాక్స్ మౌంటైన్ లోతు కారణంగా సాధారణ బంకర్ బస్టర్ బాంబులతో దానిని ధ్వంసం చేయడం కష్టమని చెబుతున్నారు. ఇరాన్‌పై అణుదాడి జరిగితే దాని రేడియోధార్మిక కాలుష్యం పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంతో పాటు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ వరకు వ్యాపించే అవకాశం ఉందని భౌగోళిక రాజకీయ నిపుణుడు మారియో నవ్‌ఫాల్ పేర్కొన్నారు.
ఆయన పంచుకున్న నమూనా ఆధారిత అంచనాల ప్రకారం గాలుల దిశ అనుకూలంగా ఉంటే భారత్‌లోని వాయవ్య ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, గుజరాత్ ప్రాంతాల వరకు తక్కువ స్థాయిలో రేడియోధార్మిక కణాలు చేరే అవకాశం ఉంది. అయితే ఇరాన్ నుంచి భారత్‌కు సుమారు 2,500 కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రయాణించే కొద్దీ రేడియేషన్ తీవ్రత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
అణు పేలుడు తీవ్రత, ఆయుధ సామర్థ్యం, పేలుడు జరిగే విధానం, గాలుల వేగం, దిశ వంటి అంశాలపై రేడియేషన్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందని రక్షణ రంగ నిపుణుడు సందీప్ ఉన్నితన్ తెలిపారు. గాలులు తూర్పు దిశగా వీచినట్లయితే అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని చెప్పారు. అక్కడి నుంచి వాయవ్య భారతదేశానికి రేడియోధార్మిక కణాలు చేరినా వాటి సాంద్రత చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చని వివరించారు.
వర్షాలు కూడా రేడియేషన్ వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. వర్షం కురిసే ప్రాంతాల్లో రేడియోధార్మిక కణాలు స్థానికంగా ఎక్కువగా పేరుకుపోయే అవకాశం ఉంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం పెద్ద రేడియోధార్మిక కణాలు పేలుడు ప్రాంతానికి సమీపంలోనే నేలపై పడిపోతాయి. చిన్న కణాలు మాత్రం గాలిలో ఎక్కువసేపు ఉండి సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

More Stories
భారత వాణిజ్య అస్థిరతపై అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం!
భారత నౌకలకు హర్మూజ్‌లో ఇరాన్ ప్రత్యేక మినహాయింపు
పశ్చిమాసియా సంఘర్షణలో 23 మంది భారతీయుల మృతి