భార‌త నౌక‌ల‌కు హ‌ర్మూజ్‌లో ఇరాన్ ప్ర‌త్యేక మిన‌హాయింపు

హ‌ర్మూజ్ జ‌ల‌సంధి దాటడం కోసం భార‌త నౌక‌ల‌కు ఇరాన్ ప్ర‌త్యేక మిన‌హాయింపులు ఇచ్చింది. భారత్‌ సహా తమ మిత్రదేశాలైన చైనా, ఇరాక్, ఖతార్  నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్‌ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అమీర్ హయత్  మొఘద్దమ్ ప్రకటించారు. ఇతర దేశాల వాణిజ్య నౌకలపై విధించిన ఆంక్షలు లేకుండానే ఈ దేశాల నౌకలు హర్మూజ్‌ జలసంధిని దాటవచ్చని స్పష్టంచేశారు. 

భారత్ నుండి పశ్చిమ దేశాలకు ఔషధాల సరఫరాను సులభతరం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ హ‌య‌త్‌ తెలిపారు. అయితే ఆయా దేశాల నౌకల నుంచి రవాణా రుసుమును మాత్రం వసూలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం హర్మూజ్‌లో రవాణా ఆంక్షల నుంచి భారత్, చైనా, ఇరాక్, ఖతార్‌లకు మినహాయింపు ఇచ్చామని, ఇకపై ఆయా దేశాల నౌకలు జలసంధిలో స్వేచ్ఛగా ప్రయాణిస్తాయని, అమెరికన్లు కూడా వాటిని అడ్డుకోర‌ని హ‌య‌త్ తెలిపారు. 

ఇరాన్ దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు దోహదం చేస్తాయనే కారణంతోనే ఈ మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. భారత్ నుంచి ఔషధాల దిగుమతిని సులభతరం చేయడానికి, చైనా నుంచి రాజకీయ మద్దతు పొందడానికి ఈ చర్యలు చేపట్టామ‌ని అమీర్ హయత్ పేర్కొన్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్‌లో నౌకాయానంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్ స‌హా మిత్ర‌దేశాల నౌక‌ల‌కు ఇరాన్ ప్ర‌త్యేక మిన‌హాయింపు ఇవ్వ‌డం గ‌మ‌నించ‌వ‌ల‌సిన విష‌యం.

“హర్మూజ్ జలసంధిలో రవాణా విషయానికి వస్తే మేము ఇప్పటికే నాలుగు దేశాలకు (భారత్, చైనా, ఇరాక్, ఖతార్‌) మినహాయింపులు ఇచ్చాం. అంటే మా కోణంలో వారు స్వేచ్ఛగా హర్మూజ్ గుండా రాకపోకలు సాగించవచ్చు. అమెరికాకు ఆయా దేశాలు ఈ జలసంధి గుండా ప్రయాణించడంపై ఎలాంటి సమస్యలు లేవు. ఈ నాలుగు దేశాల నౌకలు హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి” అని ఆయన తెలిపారు. 

“నిజానికి మేము వ్యాపారం చేస్తున్నాం కదా!. భారత నౌకలకు హర్మూజ్‌లో ఆంక్షల నుంచి ఈ మినహాయింపు ఇవ్వడం ద్వారా మేము వారి నుంచి మందులను దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే చైనాకు ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా వారి నుంచి రాజకీయ మద్దతు పొందుతున్నాం. అంతేకాకుండా వారి నుంచి మాకు ఆర్థిక చెల్లింపులు కూడా అందుతున్నాయి.” అని అహ్మద్ హయత్ మొఘద్దమ్ పేర్కొన్నారు.

 

 

About The Author